TELANGANA

కరీంనగర్‌కు నితిన్‌ నబీన్‌.. లక్ష మందితో బీజేపీ మహా పాదయాత్ర..

తెలంగాణలో పార్టీని మరింత బలోపేతం చేసి, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం దక్కించుకోవడమే లక్ష్యంగా బీజేపీ దూకుడు పెంచుతోంది. ఇందులో భాగంగా జాతీయ నాయకుల రాష్ట్ర పర్యటనలకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. తాజాగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్‌ నబీన్‌ కరీంనగర్‌ పర్యటన ఖరారైంది. ఈ నెల 18న ఆయన నగరానికి రానున్నారు. ఈ సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ నేతృత్వంలో లక్ష మందితో భారీ పాదయాత్ర నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

‘సర్‌’ అంశంపై కాంగ్రెస్‌, ఇండీ కూటమి పార్టీలు రాజ్యాంగ సంస్థలపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ ప్రచారాన్ని తిప్పికొట్టి ప్రజలకు వాస్తవాలు వివరించడమే లక్ష్యంగా పాదయాత్ర చేపడుతున్నట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. నితిన్‌ నబీన్‌ తొలిసారి కరీంనగర్‌కు వస్తుండటంతో కార్యక్రమాన్ని భారీ స్థాయిలో నిర్వహించాలని బండి సంజయ్‌ నిర్ణయించారు.

గాంధీ సర్కిల్‌, వైశ్య భవన్‌ నుంచి టవర్‌ సర్కిల్‌ మీదుగా కమాన్‌ వరకు పాదయాత్ర సాగనుంది. ఇందులో నితిన్‌ నబీన్‌తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, బండి సంజయ్‌ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి లక్ష మంది హాజరయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు బండి సంజయ్‌ వెల్లడించారు. దేశవ్యాప్తంగా కరీంనగర్‌ పేరు మారుమోగేలా మహా పాదయాత్ర నిర్వహిస్తామని చెప్పారు.

పాదయాత్ర ఏర్పాట్లపై చర్చించేందుకు బండి సంజయ్‌ కరీంనగర్‌ ఎంపీ కార్యాలయంలో పార్లమెంట్‌ నియోజకవర్గ కోర్‌ కమిటీ నేతలతో సమావేశమయ్యారు. బూత్‌ స్థాయి నుంచి మండలాల వారీగా సమావేశాలు నిర్వహించి కార్యకర్తలను సమీకరించాలని సూచించారు. మీడియా, సామాజిక మాధ్యమాల ద్వారా కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించాలని కోరారు.