World

డొనెస్క్ పరిధిలోని మాకివ్కా పట్టణంపై మిసైళ్ల వర్షం

రష్యా దళాలపై ఉక్రెయిన్ ఇటీవల మిసైళ్లతో విరుచుకుపడింది. ఈ దాడిలో మొత్తంగా 89 మంది చనిపోయారని రష్యా తాజాగా ప్రకటించింది. రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్‍లోని మకివ్కా (Makiivka) ప్రాంతంపై ఉక్రెయిన్ దళాలు గత వారం మిసైళ్లతో విరుచుకుపడ్డాయి. రష్యా సైనికుల స్థావరం ఉందని గుర్తించిన ఉక్రెయిన్.. హిమర్స్ రాకెట్లతో క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడిపై రష్యా స్పందించింది. మొబైళ్లను వాడడం వల్లే.. Makiivka Missile strikes: తమ సైనికులు నిబంధనలు ఉల్లంఘించి మొబైళ్లను వాడడం వల్లే ఆ స్థావరాన్ని ఉక్రెయిన్ గుర్తించిందని రష్యా వెల్లడించింది. ఫోన్లు వినియోగించడమే ఈ మిసైళ్ల దాడికి కారణమైందని పేర్కొంది. ముందుగా ఈ దాడిలో 63 మంది చనిపోయారని చెప్పిన రష్యా తాజాగా మరో ప్రకటన చేసింది. ఈ దాడిలో తమ సైనికులు 89 మంది మృతి చెందారని ప్రకటించింది. “సైనికులు అనుమతి లేకుండా మొబైళ్లు వాడారు. దీంతో మా సైనికుల స్థావరాన్ని శత్రువులు ట్రాక్ చేయగలిగారు. మిసైళ్ల దాడికి ఇదే కారణమైంది” రష్యా రక్షణ శాఖ పేర్కొంది. సైనికుల మృతి పట్ల రష్యా ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోంది. ఉక్రెయిన్‍లో పాగా వేసి సాధించిందేముందంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‍ను ఆ దేశానికి చెందిన కొందరు ప్రశ్నిస్తున్నారు. సైనికుల ప్రాణాలు బలవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదీ జరిగింది.. రష్యా ఆధీనంలో ఉన్న ఉక్రెయిన్‍లోని డొనెస్క్ పరిధిలోని మాకివ్కా పట్టణంపై డిసెంబర్ 31 మిసైళ్ల వర్షం కురిసింది. రష్యా సైనికులు ఉన్న స్థావరంపై ఉక్రెయిన్ దళాలు క్షిపణులను కురిపించాయి. రష్యా ప్రకారం ఈ ఘటనలో మృతుల సంఖ్య ఇప్పటికి 89కు చేరింది. రష్యా సైనికుల స్థావరంలో భారీగా పేలుడు పదార్థాలు ఉండడమే ఇంత తీవ్ర స్థాయిలో ప్రాణనష్టానికి కారణమనే అంచనాలు ఉన్నాయి. అయితే, ఈ దాడిలో 400 మందికి పైగా రష్యా జవాన్లు మరణించారని ఉక్రెయిన్ చెబుతోంది. ఓటమిని ఆలస్యం చేసుకునేందుకే.. రష్యాపై మరోసారి విరుచుకుపడ్డారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‍స్కీ. అయితే, ఈ ప్రసంసంలో మకివ్కా దాడిని ఆయన ప్రస్తావించలేదు. రష్యా మరిన్ని దాడులకు పాల్పడుతుందనేలా వ్యాఖ్యానించారు. రష్యాకు ఓటమి తప్పదని అన్నారు. అయితే ఆ ఓటమిని ఆలస్యం చేసుకునేందుకు రష్యా దాడులు చేస్తుందని అన్నారు. “మేం రష్యాను ఎదుర్కొంటాం. దానికి సిద్ధంగా ఉన్నాం. రష్యా ఇక నుంచి చేసే ప్రయత్నాలన్నీ విఫలమవుతాయి” అని జెలెన్‍స్కీ పేర్కొన్నారు. రష్యా- ఉక్రెయిన్ మధ్య గతేడాది ఫిబ్రవరి నుంచి యుద్ధం జరుగుతూనే ఉంది. ఉక్రెయిన్‍లో ప్రవేశించిన రష్యా క్రమంగా ప్రాంతాలను స్వాధీనం చేసుకుంటోంది. ఉక్రెయిన్ సైతం తీవ్రంగా ప్రతిఘటిస్తోంది.