National

విమానానికి బాంబు బెదిరింపు కాల్..అలర్ట్ అయిన అధికారులు

ఈమధ్యకాలంలో విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం కామన్ అయిపోతోంది. సెలబ్రిటీలకు , విమానాలకు బాంబు బెదిరింపు కాల్స్ రావడం వల్ల అధికారులు కూడా అలర్ట్ అవుతూ పలు చర్యలు తీసుకుంటూ ఉన్నారు. తాజాగా ఇటువంటి ఘటనే చోటుచేసుకుంది. స్పైస్‌జెట్‌ విమానంలో బాంబు ఉందని ఓ గుర్తుతెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేయడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. ఢిల్లీ నుంచి పుణే బయలుదేరడానికి సిద్ధంగా ఉన్న స్పైస్‌జెట్‌ విమానంలో బాంబు ఉందని టేకాఫ్ కు కొన్ని నిమిషాల ముందు ఓ వ్యక్తి కాల్ చేసి చెప్పాడు. సమాచారం అందుకున్న సీఐఎస్ఎఫ్, ఢిల్లీ పోలీసులు వెంటనే చర్యలు చేపట్టారు. ఢిల్లీలోని ఇందిరాగాంధీ విమానాశ్రయంలో స్పైస్ జెట్ విమానంలో తనిఖీలు నిర్వహించారు. బాంబు బెదిరింపు కాల్ గురించి ఢిల్లీ పోలీసులు మీడియాకు వివరాలను కూడా వెల్లడించారు.

గురువారం సాయంత్రం 6.30 గంటలకు ఢిల్లీ ఎయిర్ పోర్ట్ నుంచి పుణేకు స్పైస్ జెట్ విమానం టేకాఫ్ కావాల్సి ఉండగా, అంతకు కొన్ని నిమిషాల ముందు విమానంలో బాంబు ఉందని బెదిరింపు కాల్ వచ్చినట్లు అందులో పేర్కొన్నారు. ఫ్లైట్ సిబ్బంది విమానం నుంచి ప్రయాణికులను కిందకు దించి బాంబ్ స్క్వాడ్ టీమ్ తనిఖీలను నిర్వహించింది. అయితే తమకు ఎలాంటి అనుమానాస్పద వస్తువులు కనిపించడం లేదని ఢిల్లీ పోలీసులు తమ తనిఖీల్లో గుర్తించారు. అయితే సెక్యూరిటీ సిబ్బంది మాత్రం ప్రయాణికుల భద్రత పట్ల అన్ని చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఫోన్ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారు అనే కోణంలో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టారు.