2023 హాకీ వరల్డ్ కప్‌లో భారత జట్టు బోణీ చేసింది. గురువారం జరిగిన తొలి పోరులో స్పెయిన్‌పై 2-0 తేడాతో విజయాన్ని సాధించింది. ఆట ఆరంభంలో స్పెయిన్ దూకుడును ప్రదర్శించింది. అయితే పదో నిమిషం నుంచి గేమ్‌పై భారత్ పట్టు సాధించింది. స్పెయిన్ బలహీనతలను సద్వినియోగం చేసుకున్న భారత డిఫెండర్ అమిత్ రోహిదాస్ 13వ నిమిషంలో గోల్ చేసి అభిమానుల్లో ఆనందాన్ని నింపాడు. వరల్డ్ కప్‌లో ఇండియాకు ఇది 200 గోల్ కావడం గమనార్హం.
ఈ గోల్‌తో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. 27వ నిమిషంలో హార్దిక్ సింగ్ సోలో గోల్‌తో భారత్ ఆధిక్యం 2-0కు పెరిగింది. ఆ తర్వాత సెకండాఫ్‌లో భారత్ జోరు కొనసాగించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం మూడు పెనాల్టీ కార్నర్‌లు భారత్‌కు లభించినా వాటిని గోల్స్‌గా మలచడంలో ప్లేయర్లు విఫలమయ్యారు. మరోవైపు స్కోరును సమం చేసేందుకు స్పెయిన్ ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. దాంతో భారత్ 2-0తో ఈ మ్యాచ్‌లో విజయాన్ని అందుకున్నది. ఈ గెలుపుతో భారత్ ఖాతాలో మూడు పాయింట్లు చేరాయి. గ్రూప్ డిలో టాప్ ప్లేస్‌లో నిలిచింది. అమిత్ రోహిదాస్‌కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ దక్కింది.