గంగాసాగర్‌లో పుణ్యస్నానానికి వెళ్లిన భక్తులు బంగాళాఖాతంలో చిక్కుకున్నారు. అలా రాత్రంతా అక్కడే గడిపారు. వారిని పరిరక్షించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మకర సంక్రాంతి సందర్భంగా పశ్చిమ బెంగాల్‌కు చెందిన దాదాపు 600 మంది భక్తులు (600 Devotees) 24 పరగణాల జిల్లా గంగాసాగర్‌లో పుణ్యస్నానాలు ఆచరించారు. ఈ సమయంలో దట్టమైన పొగమంచు, గాలి కారణంగా బంగాళాఖాతంలో రెండు పడవలు కూడా బురదలో కూరుకుపోయాయి.
దీంతో యాత్రికులు రాత్రంతా సముద్రంలో గడపాల్సి వచ్చింది. కాక్‌ద్వీప్‌లో ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. సమాచారం అందిన వెంటనే అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. భక్తులందరికీ రక్షణ కల్పించేందుకు చర్యలు చేపట్టారు. కోస్ట్ గార్డ్ సిబ్బందిని రంగంలోకి దింపామని.. సాయం కోసం హోవర్ క్రాఫ్ట్ ను కూడా పంపామని వివరించారు. హుగ్లీ నది-బంగాళాఖాతం సంగమం దగ్గర సంక్రాంతి సందర్భంగా పుణ్యస్నానాలు చేసేందుకు దాదాపు 500 నుంచి 600 మంది భక్తులు రెండు పడవల్లో వెళ్లినట్లు ఓ వార్తా సంస్థ పేర్కొంది.