భారత సరిహద్దుల్లో చైనా చేసిన మరో పని తలనొప్పిగా మారింది! ఇండియా- నేపాల్ సరిహద్దుల్లో ఓ డ్యామ్‌ను నిర్మిస్తోంది చైనా. ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు తాజాగా బయటకొచ్చాయి. డ్యామ్.. ఎందుకు- ఎక్కడ? టిబెట్‌లోని వాస్తవాధీన రేఖకు సమీపంలో.. ఇండియా- నేపాల్‌తో సరిహద్దును పంచుకుంటోంది చైనా. కాగా.. ఈ ట్రై-జంక్షన్‌కు కొంత దూరం నుంచి గంగా నదికి చెందిన ఉపనది మబ్జా జాంగ్బో ప్రవహిస్తోంది. ఈ మబ్జా జాంగ్బో.. నేపాల్‌లోని కర్నాలీ నదిలో కలుస్తుంది. చివరికి అది ఇండియాలోని గంగా నదిలో చేరిపోతుందికాగా.. ఈ ట్రై జంక్షన్‌కు ఉత్తరాన కొన్ని కిలోమీటర్ల దూరంలోనే చైనా ఓ డ్యామ్‌ను నిర్మిస్తోందని తెలుస్తోంది.
ఇందుకు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలను.. ఇంటెల్ ల్యాబ్‌కు చెందిన జియోస్పాటియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చర్ డామియన్ సిమాన్ విడుదల చేశారు. 2021 మే నుంచి ఈ డ్యామ్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నట్టు ఆయన వివరించారు. డ్యామ్‌తో నది కదలికలను నియంత్రించేందుకు చైనా భావిస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు. తాజా ఉపగ్రహ చిత్రాల ప్రకారం.. డ్యామ్ పొడవు 350ఎంఎం- 400ఎంఎం మధ్యలో ఉండొచ్చు. “ప్రస్తుతం ఈ డ్యామ్ నిర్మాణ దశలోనే ఉంది. మరి దీనిని చైనా ఎలా ఉపయోగిస్తుందనేది స్పష్టంగా తెలియదు. ఈ డ్యామ్‌కు సమీపంలో ఓ ఎయిర్‌పోర్ట్‌ను కూడా చైనా కడుతోంది!” అని డామియన్ సిమాన్ తెలిపారు.