National

ప్రతీ సంవత్సరం బడ్జెట్ అనగానే అందరి ఆశలు

ప్రతీ సంవత్సరం బడ్జెట్ అనగానే అందరి ఆశలు, కళ్ళు దానిపైనే ఉంటాయి. ఎందుకంటే ప్రత్యక్షంగానో, పరోక్షంగానో దేశ బడ్జెట్ ప్రతి ఒక్కరి జీవనాన్ని ప్రభావితం చేస్తుంది. ఇక ఈ వార్షిక సంవత్సరం ఆదాయపు వ్యయపు పద్దులు ప్రవేశపెట్టడానికి ఆర్ధిక శాఖ మంత్రి సిద్దం అయ్యారు. బడ్జెట్ ప్రవేశ పెట్టడానికి రంగం సిద్దమైపోయింది. దీనితో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సారి బడ్జెట్ లో వందే భారత్ రైళ్లకు పెద్ద ఎత్తున కేటాయింపులు ఉంటాయని తెలియడంతో ప్రజలకు బడ్జెట్ పై మరింత ఆసక్తి పెరిగింది. అప్పట్లో సాధారణ బడ్జెట్ తో కలిపి కాకుండా రైల్వే బడ్జెట్ ను ప్రత్యేకంగా ప్రవేశ పెట్టేవారు. 2017 వరకు కూడా రైల్వే బడ్జెట్‌ను కేంద్ర బడ్జెట్‌తో కాకుండా విడిగా ప్రవేశపెట్టేవారు. ఇది 1924 లో ప్రత్యేకంగా ప్రవేశపెట్టడం ప్రారంభం అయ్యింది. తొలిసారిగా రైల్వే బడ్జెట్‌ను అప్పటి బైటీష్‌ ప్రభుత్వం ప్రారంభించింది. అలా చేయడం ద్వారా రైల్వేకు అధిక కేటాయింపు చేసి, రైల్వేను మరింత అభివృద్ధి చేయడం ఉద్దేశ్యం. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్ర మోదీ ప్రభుత్వం.. మొదటి టర్మ్‌లో రైల్వే బడ్జెట్‌ను సాధారణ బడ్జెట్‌తో కలిపింది. 2017లో తొలిసారిగా వార్షిక బడ్జెట్‌లోనే రైల్వే బడ్జెట్‌ను ప్రకటించారు. ప్రస్తుత బడ్జెట్ లో రైల్వేకు అధిక మొత్తంలో కేటాయింపులు జరుగుతాయని వార్తలు వినిపిస్తున్నాయి.

కొత్త రైల్వే లైన్లు, కొత్త రైళ్లు, కొత్త రైల్వే ఛార్జీలు, కేటాయింపులపై తదితర విషయాలపై భారీ ఆసక్తి నెలకొంది. ఈ ఏడాది బడ్జెట్‌లో వందే భారత్‌ రైళ్లు, బుల్లెట్‌ రైలు ప్రాజెక్టులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఉందని ఆర్ధిక, రైల్వే నిపుణులు అంచనా వేస్తున్నారు. దీనికోసమే ప్రీ బడ్జెట్‌ మీటింగ్‌ రైల్వే బోర్డుకు 25% నుంచి 30% వరకూ బడ్జెట్‌ కేటాయింపులు పెంచాలని డిమాండ్‌స్ వచ్చాయి. అయితే ప్రభుత్వం సాధారణ ప్రజానీకానికి మేలు కలిగేలా కేటాయింపు చేయాలనీ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. రైల్వేలైనా, ఇతర కేటాయింపులైనా సాధారణ ప్రజానీకానికి ఆర్ధిక సాంత్వన చేకూర్చేలా జాగ్రత్త పడాలని, ఆర్ధిక సమానత్వం దిశగా కేటాయింపు ఉండాలని ప్రముఖులు తమ గళం విప్పుతున్నారు. అధిక మొత్తంలో వందే భారత్ రైళ్ల కేటాయింపు ఉంటుందని ముందుగానే ప్రకటించడంతో భిన్న అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి.