ఢిల్లీ మేయర్ పీఠంపై సందిగ్ధత కొనసాగింది. ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ (Municipal Corporation on Delhi – MCD) కార్యాలయంలో జరిగిన సమావేశంలో మరోసారి రసాభాస జరిగింది. దీంతో ఢిల్లీ మేయర్ ఎన్నిక నేడు (ఫిబ్రవరి 6) కూడా జరగలేదు. మేయర్ ఎన్నిక కోసం కౌన్సిలర్లు సమావేశమై ఎటూతేల్చక పోవడం నెల వ్యవధిలో ఇది మూడోసారి. దీంతో ఢిల్లీకి మేయర్ ఎప్పుడొస్తారు.. ఏ పార్టీకి పీఠం దక్కుతుందున్న ఉత్కంఠ మరికొంత కాలం సాగనుంది. బీజేపీ(BJP)కి అనూకూలంగా లెఫ్టినెంట్ గవర్నర్ వ్యవహరిస్తున్నారని అధికార ఆమ్ఆద్మీ పార్టీ (Aam Aadmi Party – APP) కౌన్సిలర్లు నిరసనకు దిగటంతో సభ నిరవధిక వాయిదా పడింది. వివరాలివే.. ఈ విషయంపై ఆప్ వ్యతిరేకత Delhi Mayor Election: లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసిన 10 మంది కౌన్సిలర్లకు.. మేయర్ ఎన్నికలో ఓటేసే అవకాశం కల్పించడాన్ని ఆమ్ఆద్మీ పార్టీ (ఆప్) కౌన్సిలర్లు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయంపై సమావేశంలో ఆందోళన చేశారు. బీజేపీ కౌన్సిలర్లు కూడా నినాదాలు చేశారు. దీంతో సమావేశం నిరవధికంగా వాయిదా పడింది. సుప్రీంకోర్టుకు వెళతాం Delhi Mayor Election: 10 రోజుల వ్యవధిలో ఢిల్లీ మేయర్ ఎన్నిక ప్రక్రియ ముగించేలా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని ఆమ్ఆద్మీ వెల్లడించింది. ఢిల్లీ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ మెజార్టీ స్థానాలు సాధించింది.
అయితే మేయర్ ఎన్నిక మూడుసార్లు నిలిచిపోయింది. బీజేపీ కావాలనే గొడవ చేస్తూ మేయర్ ఎన్నిక వాయిదాకు కారణమవుతోందని ఆమ్ఆద్మీ ఆరోపిస్తోంది. రిగ్గింగ్ చేయాలని ఆప్ ప్రయత్నిస్తోంది Delhi Mayor Election: మేయర్ ఎన్నికల్లో రిగ్గింగ్ చేయాలని ఆమ్ఆద్మీ ప్రయత్నిస్తోందని బీజేపీ నేత మీనాక్షి లేఖి ఆరోపించారు. లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన వారు.. బీజేపీకి మద్దతిస్తారని, వారికి ఓటు హక్కు కల్పించడం సరికాదని ఆప్ అంటోంది. అయితే, ప్రిసిడింగ్ ఆఫీసర్ ఈ నిర్ణయం తీసుకుంటారని కషాయ పార్టీ చెబుతోంది. ఎవరికెన్ని స్థానాలు Delhi Mayor Election: గత సంవత్సరం డిసెంబర్లో 250 వార్డులకు గాను ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నిక జరిగింది. 134 స్థానాల్లో గెలిచిన ఆమ్ఆద్మీ పార్టీ.. మేయర్ పీఠానికి కావాల్సిన మెజార్టీని సాధించింది. బీజేపీ 104 స్థానాల్లో విజయం సాధించింది. కాంగ్రెస్ 9 చోట్ల గెలిచింది. 15 సంవత్సరాలు బీజేపీ నుంచే ఢిల్లీ మేయర్ ఉండగా.. మరోసారి పీఠాన్ని నిలబెట్టుకోవాలని ఆ పార్టీ ప్రయత్నిస్తోంది. మొత్తంగా అయితే, ఎంసీడీ ఎలక్షన్ తర్వాత మేయర్ ఎన్నిక కోసం కార్పొరేషన్ సమావేశం మూడుసార్లు జరిగినా ఎలాంటి ఫలితం లేదు. మూడుసార్లు వాయిదా పడింది. నామినేటెడ్ ఓట్లు Delhi Mayor Election: ఢిల్లీ మేయర్ ఎన్నికలో కౌన్సిలర్లతో పాటు బీజేపీకి చెందిన ఏడుగురు లోక్సభ ఎంపీలు కూడా ఓటు వేయవచ్చు. ఇక ఢిల్లీ స్పీకర్ నామినేట్ చేసిన 14 మంది ఎమ్మెల్యేలు, ఆమ్ఆద్మీకి చెందిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు కూడా ఓటు వేసే అవకాశం ఉంది. ఇప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ నామినేట్ చేసిన 10 మంది కౌన్సిలర్లు కూడా ఓటు వేసేందుకు అనుమతి ఇవ్వటంతో ఆప్ దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.