POLITICS

ఏపీలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన తీవ్ర కలకలం

పీలో గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన తీవ్ర కలకలం రేపింది. స్ధానిక ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై సోషల్ మీడియాలో టీడీపీ నేతలు దుష్ర్పచారం చేస్తున్నారనే కారణంగా అయన మద్దతుదారులు గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి చేసి ధ్వంసం చేశారు.

దీనిపై చర్యలు తీసుకోని పోలీసులు.. టీడీపీ నేత పట్టాభితో పాటు మరో 13 మందిని అరెస్టు చేశారు. గన్నవరంలో టీడీపీ ఆఫీసుపై దాడి తర్వాత స్ధానిక ఎస్సైపై దాడి జరిగేలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారని వీరిపై కేసులు నమోదు చేశారు.

ఈ వ్యవహారంలో టీడీపీ నేత పట్టాభిని రాజమండ్రి సెంట్రల్ జైలుకు రిమాండ్ పై పంపారు. గన్నవరం ఘటనల్లో అరెస్టు చేసి న్యాయమూర్తి ముందు హాజరుపర్చిన తర్వాత గన్నవరం లేదా విజయవాడ జైలుకు తరలించాల్సి ఉండగా.. స్ధానికంగా భద్రత ఉండదనే కారణంతో రాజమండ్రికి తరలించారు. ఈ నేపథ్యంలో గత పది రోజులుగా పట్టాభితో పాటు ఇతరులు కూడా జైల్లోనే ఉన్నారు. వీరు దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన విజయవాడ ఎస్సీ, ఎస్టీ కేసుల ప్రత్యేక కోర్టు.. ఇవాళ అందరికీ బెయిల్ మంజూరు చేసింది. దీంతో పట్టాభితో పాటు వీరంతా జైలు నుంచి విముక్తం కానున్నారు.

పట్టాభిని ఈ కేసులో కస్టడీకి ఇవ్వాలని పోలీసులు వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. 25వేల రూపాయల పూచీకత్తుతో ఇద్దరు జామీనులతో బెయిల్ ఇచ్చారు. అలాగే మూడు నెలల పాటు ప్రతీ గురువారం కోర్టుకు హాజరు కావాలన్న షరతు విధించారు. సాక్షులను ప్రభావితం చేయరాదని, విచారణకు సహకరించాలని జడ్జి బెయిల్ పై విడుదలవుతున్న వారిని ఆదేశించారు.గన్నవరంలో మారుతున్న రాజకీయ పరిస్ధితుల నేపథ్యంలో టీడీపీ అభ్యర్ధిగా పట్టాభికి టికెట్ దక్కొచ్చనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే ఆయన గన్నవరం టీడీపీ ఆఫీసుపై దాడి ఘటన తెలియగానే అక్కడికి వెళ్లారు. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. టీడీపీ కార్యకర్తలతో కలిసి వైసీపీ నేతలపై విరుచుకుపడ్డారు. ఈ క్రమంలోనే ఆయన మద్దతుదారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. ఇందులో స్ధానిక ఎస్సై గాయపడటంతో పోలీసులు పట్టాభిని ఈ కేసులో అరెస్టు చేసి జైలుకు పంపారు.