పరువు నష్టం కేసులో రెండేళ్ల జైలు శిక్షని నిలుపుదల చేయాలంటూ రాహుల్ గాంధీ వేసిన పిటిషన్ ని సూరత్ కోర్టు కొట్టివేసింది. మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలకు ఇటీవల సూరత్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.
ట్రయల్ కోర్టు ఈ కేసులో పారదర్శకంగా విచారణ చేపట్టలేదని, కఠినంగా వ్యవహరించిందని, రెండేళ్ల జైలు శిక్ష విధించాల్సిన కేసు కాదంటూ రాహుల్ గాంధీ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ ని సెషన్స్ కోర్టు ఈరోజు కొట్టివేసింది. గత గురువారం వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఆర్పీ మొగేరా, ఈరోజు పిటిషన్ కొట్టివేస్తూ తీర్పునిచ్చారు.
2019 కర్నాటక ఎన్నికల సమయంలో ప్రధాని మోదీ ఇంటి పేరుపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలతో ఈ వివాదం మొదలైంది. పూర్ణేష్ మోదీ అనే వ్యక్తి రాహుల్ గాంధీపై పరువు నష్టం దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన సూరత్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు రాహుల్ కి రెండేళ్ల జైలుశిక్ష విధించింది. ఈ జైలుశిక్షతో ఆయన లోక్ సభ సభ్యత్వాన్ని కూడా రద్దు చేశారు. ఆ తర్వాత ఆయన తన అధికారిక బంగ్లాను ఖాళీ చేయడం, లగేజ్ తో సహా తల్లి సోనియా ఇంటికి వెళ్లడం తెలిసిందే. అయితే రెండేళ్ల జైలుశిక్షను నిలుపుదల చేయాల్సిందిగా రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టుని ఆశ్రయించారు. ఆ కోర్టు రాహుల్ పిటిషన్ ని కొట్టివేసింది.
ఇప్పుడేం చేస్తారు..?
సెషన్స్ కోర్టు తన పిటిషన్ ని కొట్టివేయడంతో రాహుల్ గాంధీ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. తీర్పు వెలువడిన వెంటనే కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ స్పందించారు. తమకింకా కొన్ని ఆప్షన్లు మిగిలే ఉన్నాయని చెప్పారు. రాహుల్ గాంధీ త్వరలో గుజరాత్ హైకోర్టుని ఆశ్రయించే అవకాశముంది.