మణిపూర్ ప్రభుత్వం తీసుకున్న ఓ నిర్ణయంతో ఆ రాష్ట్రం భగ్గున మండిపోతోంది. గిరిజనేతరులైన మైతీ వర్గానికి ఎస్టీ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం..
కోర్టు కూడా ప్రభుత్వ నిర్ణయానికే మద్దతు తెలపడంతో మణిపూర్ లోని ఆదివాసులు తిరగబడ్డారు. బ్రాహ్మణులైన మైతీలను ఎస్టీల్లో చేర్చితే సహించేది లేదంటూ అనేక జిల్లాల్లో ఆందోళనలు ప్రారంభించారు. పోలీసులకు ఆందోళనకారులకు మధ్య ఘర్షణలు రేగాయి. ఆదివాసులు ప్రార్థనా స్థలాలు, వాహనాలను తగలబెట్టారు. గురువారం నాటికి ఇంఫాల్, చురా చంద్‌పూర్, కంగ్‌పోక్కి ప్రాంతాల్లో హింస చెలరేగింది.
మణిపూర్లోని 8 జిల్లాలో ప్రస్తుతం భయానక పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ప్రభుత్వం ఆయా జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. రాజధాని ఇంఫాల్, చుర్ చంద్‌పూర్, కాంగ్ పోక్పి సహా పలు జిల్లాల్లో ఆందోళనలు తారాస్థాయికి చేరుకున్నాయి. దీంతో మణిపూర్ ప్రభుత్వం 144 సెక్షన్ విధించింది. ఐదు రోజుల పాటు మొబైల్ ఇంటర్నెట్ సర్వీసులు నిలిపేసింది. అంతే కాదు అవసరమైతే ఆందోళనకారులపై కాల్పులు జరపమని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పోలీసు కాల్పుల్లో అనేక మంది ప్రాణాలు కోల్పోయారని అనధికారిక వార్తలు వస్తున్నాయి.
అయినప్పటికీ ఆదివాసుల నిరసనలు ఆగలేదు. మంగళవారం ప్రారంభమైన నిరసనలు, హింస ఈ రోజుకూ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ శాసన సభ్యుడు వంగ్‌జాగిన్ వాల్టే పై ఓ గుంపు దాడి చేసి తీవ్రంగా గాయపర్చడంతో అతను చావుబతుకుల మధ్య కొట్టు మిట్టాడుతున్నారు.
ఇంఫాల్‌లో గురువారం ముఖ్యమంత్రి ఎన్‌బీరెన్ సింగ్‌తో సమావేశమై తిరిగి వస్తుండగా వంగ్‌జాగిన్ వాల్టే పై ఒక గుంపు దాడి చేసితీవ్రంగా గాయపర్చింది. వాల్టే పరిస్థితి విషమంగా ఉందని, అతన్ని ఇంఫాల్‌లోని రీజినల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చేర్చా రని సీనియర్ భద్రతా అధికారి ఒకరు తెలిపారు.
సీఎం తో సమావేశానికి హాజరైన మరో శాసనసభ్యుడు మాట్లాడుతూ, వాల్టేను ఒక గుంపు అడ్డుకుని, అతని వాహనాన్ని ధ్వంసం చేసిందని, అతన్ని కూడా దారుణంగా కొట్టారని చెప్పారు. చికిత్స నిమిత్తం వాల్టేను విమానంలో ఢిల్లీకి తరలించే అవకాశం ఉందన్నారు.
కాగా, మణిపూర్ లో 64 శాతం జనాభా ఉన్న మైతీ తెగ ప్రజలు బ్రాహ్మణ వర్గానికి చెందినవారు. బెంగాలీ మాట్లాడుతారు. వీరు ప్రధానంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. దీంతో మైతీలకు ఎస్టీ హోదా ఇవ్వటాన్ని ఆదివాసీలు మొదటి నుంచి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయితే ఎన్నికల్లో పెద్ద ఎత్తున ప్రభావం చూపగల మైతీల వైపే బీజేపీ నిల్చింది. కోర్టు కూడా మైతీలకు ఎస్టీ హోదా ఇవ్వడాన్ని సమర్దించడంతో రాష్ట్రం రణరంగంగా మారింది.