ఆర్టీసీ ప్రయాణీకులకు గుడ్ న్యూస్. ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి రాబోతున్నాయి. 12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు హైటెక్ హంగులతో అందుబాటులోకి వస్తున్నాయి.
ఈ బస్సుల్లో ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించే విధంగా అన్ని సౌకర్యాలు కల్పించారు. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ప్రతి 20 నిమిషాలకో ఎలక్ట్రిక్ ఏసీ బస్సు నడిపేలా ప్రణాళిక రూపొందించామని సంస్థ ప్రకటించింది.
ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు: పర్యావరణ హితం..మెరుగైన వసతులతో సిద్దమైన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు సిద్దమయ్యాయి. మంగళవారం ఈ కొత్త ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రారంభించనున్నారు. వీటికి ఈ – గరుడ బస్సులుగా పేరు ఖరారు చేసారు. హైదరాబాద్-విజయవాడ మార్గంలో 50 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నడపాలని నిర్ణయించినట్లు టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. వాటిలో 10 బస్సులను మంగళవారం నుంచి వాడకంలోకి తెస్తోంది. అత్యున్నత నాణ్యత ప్రమాణాలు, హైటెక్ హంగులతో అందుబాటులోకి తెస్తున్న ఈ బస్సులు ప్రతీ 20 నిమిషాలకు ఒకటి అందుబాటులో ఉంచేలా ప్రణాళికలు సిద్దం అయ్యాయి.
హైటెక్ హంగులతో సిద్దం: రాబోయే రెండేళ్లలో కొత్తగా 1860 ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తెస్తున్నామని తెలిపింది. వాటిలో 1300 బస్సులను హైదరాబాద్ సిటీలో, 550 బస్సులను సుదూర ప్రాంతాలకు నడుపుతామని పేర్కొంది. హైదరాబాద్ లో 10 డబుల్ డెక్కర్ బస్సులను త్వరలోనే ప్రారంభిస్తామని వివరించింది. 12 మీటర్ల పొడవు గల ఈ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు హైటెక్ హంగులతో సిద్దమయ్యాయి. 41 సీట్ల సామర్థ్యం గల ఈ బస్సుల్లో ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సౌకర్యంతో పాటు రీడిండ్ ల్యాంప్ లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు ప్రతి సీటు వద్ద పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంనకు అనుసంధానం చేశారు. ప్రతి బస్సులోనూ మూడు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వాటికి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్ ఉంటుంది.