National

తిరుపతిలో అపశృతి.. గోవిందరాజస్వామి ఆలయం ముందు ప్రమాదం.. ఒకరి మృతి

తిరుపతిలో(Tirupati) ఊహించని అపశృతి చోటు చేసుకుంది. తిరుపతిలోని గోవిందరాజస్వామి (Govindaraja Swamy Temple) ఆలయం ముందు ఉన్న పెద్ద మర్రి చెట్టు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది.

ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే చనిపోయారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని వెంటనే తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. వందల ఏళ్ల నాటి మర్రి చెట్టు కూలిపోవడంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. ఇది ఊహించని ప్రమాదం కావడంతో ప్రాణనష్టం సంభవించినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం గోవిందరాజస్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి.

ప్రమాదం జరిగిన సమయం బ్రేక్ సమయం కావడంతో దర్శనం కోసం బయటే వేచి చూశారు. సమయం ముగిసిన వెంటనే ఆలయంలోని వెళ్లి స్వామిని దర్శించుకోవాలని భావించారు. ఈ క్రమంలో ఒక్కసారిగా భారీగా గాలులు వీయడం.. వాటి ధాటిగా ఆలయం బయట ఉన్న మర్రి చెట్టు కూలిపోవడం వెంటవెంటనే జరిగిపోయాయి.

ఘటనకు గంట ముందు తిరుపతిలో భారీగా ఎండ ఉంది. ఆ తరువాత ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. పెద్ద ఎత్తున గాలులు వీచాయి. దీంతో ఆలయం బయట ఉన్న మర్రిచెట్టు కూలిపోయింది. బ్రేక్ సమయంలో చెట్టు కింద కూర్చుని సేద తీరుతున్న భక్తులు ఈ ఘటనలో గాయపడ్డారు. చెట్టు కూలిపోవడంతో దాని పరిసరాల్లో ఉన్న భక్తులు భయంతో కేకలు వేస్తూ పరుగులు తీశారు. వెంటనే రంగంలోకి దిగిన స్థానికులు ఘటనలో గాయపడిన వారిని బయటకు తీసి ఆస్పత్రికి తరలించారు.