AP

ప్రయాణికులకు గుడ్‌ న్యూస్- టికెట్లపై 10 శాతం డిస్కౌంట్

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త గమ్యస్థానాలకు ప్రత్యేక బస్సులను నడిపిస్తోంది.

పర్యాటకాభివృద్ధి సంస్థతో పోటీ పడుతూ ప్రత్యేక ప్యాకేజీ ట్రిప్పులను అందుబాటులోకి తీసుకొస్తోంది. ఏపీటీడీసీ తరహాలోనే ప్రయాణికుల కోసం అనేక పర్యాటక కేంద్రాలకు బస్సులను ప్రవేశపెడుతోంది. మంచి ఆదరణ లభిస్తోండటంతో మరిన్ని కీలక నిర్ణయాలను తీసుకుంటోంది.

తమిళనాడులోని అరుణాచలం, వేలాంకిణికి సమ్మర్ స్పెషల్ సర్వీసులను ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. పుణ్యక్షేత్రాలతో పాటు పర్యాటక కేంద్రాలకూ సమాన ప్రాధాన్యత ఇస్తూ ప్రత్యేక బస్ సర్వీసులను ప్రవేశపెట్టడానికి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఊటీ, గోవా, పుదుచ్చేరికి ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. వీకెండ్ సర్వీస్ పేరుతో ప్రతి శనివారం నెల్లూరు నుంచి పుదుచ్చేరి మధ్య ప్రవేశపెట్టిన బస్సుకు మంచి డిమాండ్ లభిస్తోంది.

ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో స్టార్ లైనర్, నైట్ రైడర్, ఇంద్ర బస్ సర్వీసుల సంఖ్యను నడిపిస్తోంది ఏపీఎస్ఆర్టీసీ. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప.. వంటి జిల్లా కేంద్రాల నుంచే కాకుండా ఇతర పట్టణాల నుంచీ హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి నగరాలకు స్టార్ లైనర్, నైట్ రైడర్ బస్సులను ప్రవేశపెట్టింది. వాటికి ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది.