ఉత్తర్ ప్రదేశ్ లో మరో దారుణ ఘటన చోటు చేసుకుంది. బారాబంకిలోని హైదర్ ఘర్ లో నివసిస్తున్న ఓ దళిత మైనర్ బాలిక అత్యాచారానికి గురైంది. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది.
అదే సమయంలో ఆమెను మెజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చేందుకు తీసుకెళ్లాల్సి ఉంది. ఆ లోపే ఆమె ఇంట్లోనే ఉరేసుకుని కనిపించింది. దీంతో ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది.
బారాబంకిలో అత్యాచారానికి గురైన దళిత మైనర్ బాలిక బలవన్మరణానికి పాల్పడిన ఘటనపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు కేసు దర్యాప్తు అధికారిని సస్పెండ్ చేశారు. సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ దినేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ, “హైదర్‌ఘర్ పోలీస్ స్టేషన్‌లో జూన్ 17 న రేప్ కేసు నమోదైందని, నిందితుడిని గురువారం అదుపులోకి తీసుకున్నారని తెలిపారు. అలాగే బాలిక తన వాంగ్మూలాన్ని నమోదు చేయడానికి మేజిస్ట్రేట్ ముందు ఇవాళ హాజరుకావాల్సి ఉందన్నారు.
ఆలోపే బాధితురాలు ఆత్మహత్యకు పాల్పడిందని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపించామని, తదుపరి విచారణ జరుపుతున్నామని ఎస్పీ తెలిపారు. కేసు ఉపసంహరించుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్న నిందితుడిని పోలీసులు పట్టుకోవడంలో విఫలమవడంతోనే ఆమె ప్రాణం పోయిందని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో పోలీసుల వైఫల్యంపై కుటుంబ సభ్యులు చేసిన ఆరోపణలను కూడా పరిశీలిస్తున్నామని ఎస్పీ తెలిపారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు విచారణ అధికారి యోగేంద్ర ప్రతాప్‌సింగ్‌ను సస్పెండ్ చేశామని ఎస్పీ తెలిపారు.
యూపీలో శాంతి భద్రతలు పరిరక్షిస్తున్నట్లు సీఎం యోగీ ఆదిత్యనాథ్ తాజాగా పదే పదే చెబుతున్న తరుణంలో బారాబంకీ రేప్, ఉరి ఘటన రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. విపక్షాలు దీనిపై విమర్శలు మొదలుపెట్టాయి. యోగీ సర్కార్ లో శాంతి భద్రతల పరిస్ధితికి బారాబంకీ ఘటన అద్దం పడుతోందని తెలిపాయి.