: రాజధాని అమరావతి రైతులకు సీఎం జగన్ సర్కార్ తీపికబురు చెప్పింది. అమరావతికి భూములిచ్చిన రైతులకు వార్షిక కౌలు చెల్లింపుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది.
ఈ మేరకు రూ.200 కోట్లు రిలీజ్ చేస్తూ జీవో ఇచ్చామని తెలిపారు. ఈ మొత్తం కూడా రైతుల అకౌంట్లో త్వరలోనే జమ అవుతుందని సీఆర్డీఏ తరపు న్యాయవాది హైకోర్టుకు స్పష్టం చేశారు.
కాగా అమరావతి రైతులకు కౌలు చెల్లింపులో జాప్యాన్ని సవాల్ చేస్తూ మంగళగిరికి చెందిన రైతు ఒకరు హైకోర్టును ఆశ్రయించారు. వెంటనే కౌలు చెల్లించేలా ప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని ఈ పిటీషన్ లో పేర్కొన్నారు.
దీనిపై హైకోర్టు విచారణ జరపగా కీలక వాదనలను న్యాయవాదులు వినిపించారు. రైతులకు ఏటా చట్టబద్దంగా ప్రభుత్వం వార్షిక కౌలు చెల్లించాల్సి ఉందని పిటీషనర్ తరపు లాయర్ వాదనలు వినిపించారు.
ఇందులో ఎలాంటి వివాదాంశం లేదని..ప్రభుత్వమే డబ్బులు చెల్లించకుండా జాప్యం చేస్తుందని ఆరోపించారు.
అయితే ఇప్పటికే రూ.200 కోట్లు రిలీజ్ చేసినట్టు ప్రభుత్వం జీవో ఇచ్చిందని..త్వరలోనే సొమ్ము జమ అవుతుందని సీఆర్డీఏ లాయర్ తెలిపారు. దీనితో త్వరలోనే అమరావతి రైతులకు కౌలు మొత్తం కూడా వారి ఖాతాల్లో జమ కానుంది.
ఇదిలా ఉంటే నేడు రైతుల ఖాతాల్లోకి ఇన్ పుట్ సబ్సిడీ నిధులను కళ్యాణదుర్గంలో జరిగే రైతు దినోత్సవంలో సీఎం జగన్ విడుదల చేయనున్నారు.
2022 ఖరీఫ్ కు సంబంధించి ఫసల్ భీమా కింద రైతులను ఆదుకునేందుకు రూ.1,016 కోట్లను సీఎం జగన్ విడుదల చేయనున్నారు.