ఎన్నికల వేళ సర్వేలు హల్చల్ చేస్తున్నాయి. ప్రజల నాడిపట్టే ప్రయత్నం చేస్తున్నాయి. అయితే ఏపీలో ఒకే నెలలో చేసిన సర్వేల్లో ఫలితాలు విభిన్నంగా రావడం విశేషం.
జూలై నెలలోనే రెండు జాతీయ సర్వేలు వెలువడ్డాయి. జూలై 1న టైమ్స్ నౌ సర్వే చూసుకుంటే ఏపీలో వైసీపీ క్లీన్ స్వీప్ చేస్తోందని చెప్పుకొచ్చింది.నెలాఖరులో వచ్చిన ఇండియా టీవీ సర్వే చూస్తే వైసీపీకి ఓట్లు, సీట్లు తగ్గిపోయాయి. కేవలం 18 ఎంపీ సీట్లు వస్తాయని ఈ సర్వే అంచనా వేసింది. నెల రోజుల్లో గ్రాఫ్ తగ్గిపోవడం విశేషం.
టైమ్స్ నౌ సర్వే సంస్థ వైసిపి 52 శాతం ఓట్లను దక్కించుకుంటుందని చెప్పింది. ఇండియా టీవీ మాత్రం 46 శాతం ఓట్లు వస్తాయని అంచనా వేసింది. నెల రోజుల వ్యవధిలో ఆరు శాతం ఓటు షేరింగ్ తగ్గడం వైసీపీ శ్రేణులను ఆందోళన కలిగిస్తోంది.
అయితే ఈ రెండు సర్వేలు ఏపీలో పొత్తుల ఎత్తులను, తెరవెనుక వ్యూహాలను టచ్ చేయలేదు. టిడిపి, జనసేన, బిజెపి పొత్తులో ఉంటే ఏ రకమైన ఫలితాలు వస్తాయన్నది సర్వే చేసి ఉంటే బాగుండేదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.ఎందుకంటే బిజెపికి ఎనిమిది శాతం ఓటింగ్ వస్తుందని అంచనా వేయడం విశేషం. జనసేన ఓటింగ్ శాతం బిజెపిలో కలిపి ఉంటారనేది ఒక అంచనా.టిడిపికి 36% ఓటింగ్ వస్తుందని పోల్ తేల్చింది. అందుకే మూడు పార్టీలు కలిస్తే.. పోటీ హోరా హోరీగా ఉంటుందని తాజా ఒపీనియన్ పోల్లో వెల్లడయింది. అయితే నెల రోజుల్లోనే ఏపీ ప్రజల నాడి మారడం విశేషం. ఇంకా ఎన్నికలకు 10 నెలల వ్యవధి ఉంది. అంటే వచ్చే ఎన్నికలు అధికార విపక్షాల మధ్య బిగ్ ఫైట్ గా మారనున్నాయని సంకేతాలు మాత్రం వెలువడుతున్నాయి.