National

తండ్రి ఎంట్రీతో ఘోరం జరిగిపోయింది

ఉన్నత చదువులపై దృష్టి సారించాల్సిన వయస్సులో ప్రేమ వ్యవహారాలతో యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తొందరపాటు పనులు చేసి తమ జీవితాలను మధ్యలోనే ముగిస్తూ..

వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. ప్రేమించిన యువతికి పిజ్జా ఇచ్చేందుకు వెళ్లి.. అనుకోని పరిణామం ఎదురుకావడంతో భవనంపైనుంచి దూకి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ విషాద ఘటన హైదరాబాద్ నగరంలోని బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మహమ్మద్ షోయబ్(19) అనే యువకుడు బోరబండలోని ఓ బేకరిలో పనిచేస్తున్నాడు. అతనికి అదే ప్రాంతంలో నివసించే యువతితో పరిచయం ఏర్పడి.. ఆ తర్వాత ప్రేమగా మారింది. ఈ క్రమంలో సోమవారం రాత్రి యువతి కోరిక మేరకు షోయబ్.. పిజ్జా తీసుకుని వాళ్ల ఇంటికి వెళ్లాడు. అయితే, అప్పుడు యువతి తండ్రి బిల్డింగ్‌పైకి రావడంతో.. భయపడి పోయిన యువకుడు నాల్గవ అంతస్తుపైనుంచి దూకాడు. దీంతో అతనికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. షోయబ్‌ను చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన షోయబ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు బోరబండ పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ప్రేమపేరుతో వివాహేతరం సంబంధం: చివరకు ఆమె ప్రాణం తీసింది

ఒంటరి మహిళను ఓ వాలంటీర్ ప్రేమ పేరుతో నమ్మించి, వివాహేతర సంబంధం కొనసాగించాడు. ఇప్పుడు ముఖం చాటేయడంతో ఓ ఒంటరి మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటన అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం పప్పుశెట్టిపాలెంలో చోటు చేసుకుంది. పప్పుశెట్టిపాలెం గ్రామానికి చెందిన మహిళ భర్త నుంచి విడాకులు తీసుకుని ఒంటరిగా జీవిస్తోంది.

అదే గ్రామానికి చెందిన వాలంటీర్ శివప్రసాద్ ప్రేమ పేరుతో ఆమెకు దగ్గరయ్యాడు. మూడేళ్లుగా తన అవసరం తీర్చుకుని.. ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని, అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది. ఘటనపై విచారించి చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.