TELANGANA

నా అన్న గద్దర్ అంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగభరిత కావ్యం

ప్రజా యుద్ధనౌక గద్దర్ మరణాన్ని ఆయన అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఆయనకు అత్యంత ఆప్తుడిగా మారిన జనసేన అధినేత, ప్రముఖ సినీనటుడు పవన్ కళ్యాణ్..

గద్దర్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి గురవుతున్నారు. తనను తమ్ముడూ అంటూ అప్యాయంగా పిలిచే గద్దర్ లేకపోవడంతో తనకు వ్యక్తిగతంగా కూడా తీరని లోటని అంటున్నారు.

గద్దర్‌ను ఒక ప్రజా గాయకుడిగా ఎంతో గౌరవిస్తూనే.. తన సొంత అన్నలా భావించేవారు పవన్ కళ్యాణ్. గద్దర్, పవన్ మధ్య మంచి అనుబంధం ఉంది. గద్దర్ మరణవార్త వినగానే తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పవన్ కళ్యాణ్.. వెంటనే ఎల్బీ స్టేడియంలో ఉంచిన ఆయన పార్థీవదేహానికి నివాళులర్పించారు. గద్దర్ కుటుంబసభ్యులు ఆయన పరామర్శించి ఓదార్చారు. ఒక్కసారిగా భావోద్వేగానికి గురై కంటతడి పెట్టుకున్నారు.

ప్రజా గాయకుడిని గుర్తు చేసుకుంటూ.. ‘నా అన్న ప్రజా యుద్ధనౌక గద్దర్’ అంటూ ఓ ప్రత్యేక కావ్యాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు పవన్ కళ్యాణ్. గద్దర్‌తో తనకున్న అనుబంధాన్ని భావోద్వేగ భరితంగా వెల్లడించారు. అణగారిన వర్గాలకు ఆసరా గద్దర్ అంటూ పేర్కొన్నారు.

‘బీటలు వారిన ఎండలో సమ్మిట కొట్టే కూలీకి గొడుగు గద్దర్.. తాండాల బండల్లో చలిపులిని బెదిరించే నెగడు గద్దర్.. పీడిత జనుల పాట గద్దర్.. అణగారిన ఆర్తుల ఆసరా గద్దర్.. అడవిలో ఆకు చెప్పిన కథ గద్దర్.. కోయిల పాడిన కావ్యం గద్దర్.. గుండెకు గొంతోస్తే..బాధకు భాషోస్తే.. అది గద్దర్.. అన్నింటిని మించి నా అన్న గద్దర్.. అన్నా.. నువ్వు గాయపడ్డ పాటవి.. కానీ ప్రజల గాయాలకు పట్టుబడ్డ పాటవి. అన్యాయంపై తిరగబడ్డ పాటవి. ఇదివరకు నువ్వు ధ్వనించే పాటవి. ఇప్పుడు కొన్ని లక్షల గొంతుల్లో ప్రతిధ్వనించే పాటవి. తీరం చేరిన ప్రజా యుద్దనౌకకు జోహార్’ అంటూ పవన్ కళ్యాణ్ తన భావోద్వేగాన్ని వెల్లడించారు.