NationalTELANGANA

మైనార్టీలకు గుడ్‌న్యూస్: 16 నుంచి రూ. లక్ష సాయం చెక్కుల పంపిణీ

తెలంగాణ రాష్ట్రంలోని మైనార్టీలకు కేసీఆర్ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. మైనార్టీల సంక్షేమంలో భాగంగా సీఎం కేసీఆర్ ప్రకటించిన లక్ష రూపాయల ఆర్థిక సాయం కార్యక్రమాన్ని అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని ఆర్థిక మంత్రి హరీశ్ రావు అధికారులను ఆదేశించారు.

మొదటి దశలో భాగంగా ఎంపికైన పది వేల మంది లబ్ధిదారులకు ఆగస్టు 16 నుంచి లక్షల రూపాయల చెక్కుల పంపిణీ ప్రారంభించాలని ఆదేశించారు.

అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు మైనార్టీల సమస్యలపై చర్చించేందుకు సచివాలయంలో ఆర్థిక మంత్రి అధ్యక్షతన మంగళవారం సమావేశం జరిగింది. హరీశ్ రావుతోపాటు మంత్రులు మహమూద్ అలీ, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, డిప్యూటీ స్పీకర్ పద్మారావు, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ, సీఎస్ శాంతికుమార్, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు, మైనార్టీ సెక్రటరీ ఉమర్ జలీల్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

సమావేశంలో మైనార్టీలకు లక్ష ఆర్థిక సాయం, ఓవర్ సీస్ స్కాలర్ షిప్, స్మశాన వాటికలకు స్థలాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్, మౌజం సంఖ్య పెంపు, క్రిస్టియన్ స్మశాన వాటికలు , ఆర్డీఎఫ్, ఎంటీఎఫ్ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ.. రాష్ట్రంలోని ఇతర వర్గాలతో సమానంగా మైనార్టీ వర్గాల సంక్షేమంతోపాటు అన్ని వర్గాల అభివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతో శ్రద్ధ వహిస్తున్నారని తెలిపారు.

ప్రతి నియోజకవర్గంలో జనాభా దామాషా ప్రకారం రూ. లక్ష ఆర్థిక సహాయం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగాలని మంత్రి హరీశ్ రావు స్పష్టం చేశారు. మైనార్టీల జనాభా ఎక్కువగా ఉన్న నియోజకవర్గాలపై మరింత దృష్టి సారించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. బీసీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమంపై అధికారులతో సమీక్ష నిర్వహించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని ఆదేశించారు.

స్మశాన వాటిలకు 125 ఎకరాల కేటాయింపు, గౌరవ వేతనం పొందే ఇమామ్‌లు-మౌజమ్‌ల సంఖ్య పెంపు వంటి రెండు హామీలను ఇప్పటికే ప్రభుత్వం పూర్తి చేసిందన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఇప్పటికే కేటాయించిన రూ. 270 కోట్లకు అదనంగా, మరో రూ. 130 కోట్లు కేటాయించి మొత్తం రూ. 400 కోట్లు ఈ కార్యక్రమం అమలుకు కేటాయించాలని ఆర్థిక శాఖను మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.