National

అడుగు రూ.లక్ష పైనే: అమ్ముడుపోని ఆ రెండు ప్లాట్లు

హైదరాబాద్: హైదరాబాద్ నగర శివార్లల్లో నిర్వహిస్తోన్న భూముల ఇ-వేలంపాటలు తెలంగాణ ప్రభుత్వానికి కాసుల వర్షాన్ని కురిపిస్తోన్నాయి. మొన్నటి మొన్న కోకాపేట్‌లో హెచ్‌ఎండీఏ నిర్వహించిన ఇ-వేలంలో ఎకరం 100 కోట్ల రూపాయలను అధిగమించింది.

హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చరిత్రలో కోకాపేట్‌ భూముల ధరలు సరికొత్త రికార్డు నమోదు చేశాయి.

ఈ- ఆక్షన్‌లో టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలు స్థలాలను కొనుగోలు చేయడానికి పోటీ పడ్డాయి. వేలంలో అత్యధికంగా ఎకరం భూమి ధర గరిష్ఠంగా 100 కోట్ల రూపాయలను అందుకుంది. అత్యల్పంగా 67 కోట్ల రూపాయలు పలికింది. కోకాపేట్ భూముల వేలం తరువాత హైదరాబాద్‌ శివార్లలోని మిగిలిన ప్రాంతాల్లోనూ హెచ్ఎండీఏ భూముల వేలం పాటలను చేపట్టింది.

ఇప్పుడు తాజాగా రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం పరిధిలోని మోకిలలో ప్లాట్ల వేలంపాటలను హెచ్‌ఎండీఏ నిర్వహించింది. దశలవారీగా భూముల అమ్మకాలను నిర్వహిస్తోంది. తొలిదశలో 50 ప్లాట్లను ఇ-వేలంలో విక్రయించింది. ఈ 50 ప్లాట్లు కూడా హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి.

మోకిలా లే అవుట్‌లోని ప్లాట్లలో నిర్వహించిన ఈ-వేలం ద్వారా 121.40 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఆర్జించింది. 300 చదరపు గజాల నుంచి 500 చదరపు గజాల వరకు ఉన్న 50 ఓపెన్ ప్లాట్లు ఇ-వేలంలో విక్రయించింది హెచ్ఎండీఏ. 15,800 చదరపు గజాలను ఉదయం, సాయంత్రం రెండు సెషన్లల్లో అధికారులు ఇ-వేలాన్ని నిర్వహించారు.

ఉదయం 25 ప్లాట్లు ఇ-వేలానికి ఉంచారు. వాటి పరిమాణం మొత్తంగా 8,000 చదరపు గజాలు. వాటి అప్‌సెట్ ధర 20 కోట్ల రూపాయలు. వేలం ఆరంభించిన కొద్దిసేపటికే అవన్నీ అమ్ముడుపోయాయి. మొత్తంగా 65.49 కోట్ల రూపాయలకు బిడ్డర్లు కొనుగోలు చేశారు. 308, 322 నంబర్ ప్లాట్లు అత్యధిక ధర పలికాయి.

సాయంత్రం మరో 25 ప్లాట్లకు ఇ-వేలం నిర్వహవించారు. వాటి పరిమాణం 7,800 గజాలు. 19.50 కోట్ల రూపాయలను అప్‌సెట్ ధరగా నిర్ధారించారు. ఇందులో 23 ప్లాట్లు అమ్ముడుపోయాయి. రెండు ప్లాట్లు మిగిలిపోగా.. 7,100 చదరపు గజాల స్థలం ఇ-వేలంలో అమ్ముడుపోయింది.

ఒక్కో గజానికి 25,000 రూపాయలను అప్‌సెట్ ధరగా నిర్ధారించారు. దీనికి అయిదంతల రేట్లు పలికాయి మోకిల ప్లాట్ల ధరలు. గరిష్ఠంగా ఒక చదరపు గజం 1.05 లక్షల రూపాయలు పలికింది. ఇది సరికొత్త రికార్డు. కనిష్ఠంగా ఒక చదరపు గజం 72,000 రూపాయలు పలికింది. ఒక్కో చదరపు గజం ధర సగటున 80,397 రూపాయలుగా తేలినట్లు హెచ్‌ఎండీఏ అధికారులు వెల్లడించారు.