National

జాతీయ రహదారి 65పై మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను ఏర్పాటు..?

భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిశారు. జాతీయ రహదారి 65పై మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవేను ఏర్పాటు చేయాలని ప్రధానిని కోరారు.

హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య ఉన్న జాతీయ రహదారి 65.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను కలిపే అత్యంత రద్దీ రోడ్డు అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

ప్రస్తుతం జాతీయ రహదారి 65ను ఆరు లేన్లుగా మారుస్తున్నారని తెలిపారు. ఎల్బీనగర్ నుంచి మల్కాపూర్ వరకు 6 వరుసల నిర్మాణ పనులు జరుగుతున్నాయని, 44 కిలోమీటర్ల వరకు పనులు చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పారు. రోజు రోజుకు ఈ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతోందని, ప్రజా అవసరాల దృష్ట్యా రోడ్డును అప్‌గ్రేడ్ చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని మోడీని కోరినట్లు కాంగ్రెస్ ఎంపీ తెలిపారు.

మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు ప్రస్తుత హైవేకు సమాంతరంగా గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే నిర్మించాలని ప్రధానికి విన్నవించినట్లు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చెప్పారు. హైదరాబాద్-విజయవాడ మార్గంలో ఉన్న ట్రాఫిక్ రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలని కోరానని తెలిపారు.

హైదరాబాద్-విజయవాడను కలిపే రహదారిలో 17 బ్లాక్ స్పాట్ల మరమ్మతు అంశంపైనా మరింత దృష్టిపెట్టాలని ప్రధానికి సూచించానని తెలిపారు. ఈ అంశంపై ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారని కోమటిరెడ్డి వెంకట రెడ్డి తెలిపారు.

‘ఢిల్లీలో భారత ప్రధాని నరేంద్ర మోడీని కలిశాను. తెలంగాణ రాష్ట్రంలోని పలు అంశాలపై చర్చించాను. ముఖ్యంగా జాతీయ రహదారి 65పై మల్కాపూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ ప్రెస్ హైవేని ఏర్పాటు చేయాలని కోరాను.హైదరాబాద్ లోని గురునానక్, శ్రీనిధి యూనివర్సిటీలపై ఫిర్యాదు చేశాను. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఈ అంశంపై విచారణ జరిపించాలని కోరాను. ప్రధాని మోడీ సానుకూలంగా స్పందించారు’ అని ట్విట్టర్ వేదికగా వెల్లడించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.