National

ప్రమాదంలో చంద్రబాబు జీవితం.. అంతమొందించే కుట్ర..!

ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసులో అరెస్ట్‌ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు రాజమండ్రి సెంట్రల్‌ జైలులో రిమాండ్‌లో ఉన్నారు.. గత నెల 9వ తేదీన చంద్రబాబును సీఐడీ అరెస్ట్‌ చేసింది..

చంద్రబాబు రిమాండ్‌ 36వ రోజుకు చేరింది.. అయితే, ఆయన ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యులు, టీడీపీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. చంద్రబాబును డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహిస్తు్న్నారని.. చంద్రబాబు భద్రత, ఆరోగ్య విషయంలో నిబంధనల మేరకే వ్యవహరిస్తున్నామని జైలు అధికారులు స్పష్టం చేస్తు్నారు.. అయితే, జైలు అధికారులపై సంచలన ఆరోపణలు చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్.. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ, జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉంచుతూనే 73 ఏళ్ల చంద్రబాబుని అనారోగ్య కారణాలతో అంతమొందించే కుట్ర జరుగుతోందన్నారు.

 

భద్రతలేని జైలులో చంద్రబాబు ఆరోగ్యం క్షీణించేలా చేసి ఆయనకి ప్రాణహాని తలపెడుతున్నారంటూ ఆరోపించారు నారా లోకేష్‌.. ఎన్నడూ ఏ తప్పూ చేయని 73 ఏళ్ల చంద్రబాబు పట్ల రాక్షసంగా వ్యవహరిస్తోంది ఈ ప్రభుత్వం అని మండిపడ్డారు. చంద్రబాబు ఆరోగ్యంపై జైలు అధికారుల తీరు సందేహాస్పదంగా ఉందన్నారు. జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుని ముద్దాయి అని హెల్త్ బులెటిన్‌లో పదే పదే పేర్కొన్నారు.. ముద్దాయి అనేందుకు పెట్టిన శ్రద్ధ చంద్రబాబు ఆరోగ్యం, భద్రతపై పెట్టడంలేదన్నారు. చంద్రబాబుకి ఏ హాని జరిగినా, సైకో జగన్ సర్కార్‌, జైలు అధికారులదే బాధ్యత అన్నారు. చంద్రబాబు ఆరోగ్యంపై ఎందుకీ కక్ష? చంద్రబాబు జీవితం ప్రమాదంలో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌.