దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మరోసారి ప్రకంపనలు రేకెత్తాయి. కల్వకుంట్ల కవిత తర్వాత తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న వైసీపీ ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు.
ఇదే కేసులో మరో నిందితుడిగా ఉన్న ఎంపీ తనయుడు మాగుంట రాఘవ ఇప్పటికే అప్రూవర్ గా మారారు. తాజాగా కొడుకుతోపాటు తండ్రి కూడా అప్రూవర్ గా మారిపోయారు. శుక్రవారం సాయంత్రం ఈ కేసుకు సంబంధించిన కీలక సమాచారాన్ని ఈడీ అధికారులకు అందజేసినట్లు తెలుస్తోంది. ఎంపీ నిర్ణయంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇదే హాట్ టాపిక్ గా మారింది.
ఈ కేసుకు సంబంధించి సౌత్ గ్రూప్ లో మాగుంట శ్రీనివాసులరెడ్డి, మాగుంట రాఘవ కీలకంగా వ్యవహరించినట్లు తీవ్ర ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వీరిద్దరూ అప్రూవర్ గా మారడంతో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే స్పీడు పెంచిన ఈడీ అధికారులు హైదరాబాద్ నుంచి డిల్లీకి నగదు బదిలీ ఎలా జరిగింది? ఎవరు చేశారు? ఎక్కడి నుంచి ఎక్కడకు పంపించారు? కీలకంగా వ్యవహరించింది ఎవరు? అనే కోణంలో దర్యాప్తు చేస్తోంది.
వీరిద్దరూ అప్రూవర్లుగా మారడం ఊహించని పరిణామమేనని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకూ అప్రూవర్లుగా మారిన వారిలో చాలా మంది సౌత్ గ్రూప్‌నకు చెందిన వారే ఉన్నారు. ఈ కేసులో ప్రధానంగా వినిపిస్తున్న ఇండో స్పిరిట్ కంపెనీలో కీలక భాగస్వామ్యం మాగుంట శ్రీనివాసులరెడ్డిదే కావడం గమనార్హం. అప్రూవర్‌గా మారిన మాగంటి ఈడీకి ఏ సమాచారం ఇచ్చారు..? ఎవరెవరి గురించి బయటపెట్టారు..? అనేది ఇప్పుడు ఆసక్తిని రేకెత్తిస్తోంది.