తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 10 ఏళ్లలో కేసీఆర్ సర్కార్ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి మరోమారు నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది.
2017లో టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ పోస్టుల భర్తీ కోర్టు కేసుల కారణంగా రెండేళ్లకు భర్తీ అయ్యాయి. తర్వాత నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఈ క్రమంలో ప్రభుత్వ పాఠశాలల్లో వివిధ విభాగాల్లో 20 వేల పోస్టులు ఖాళీ అయినట్లు విద్యాశాఖ అధికారులు ప్రభుతావనికి నివేదిక ఇచ్చారు. కానీ, ఖాళీలను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని సర్కార్ నిర్ణయించింది. ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుంటే.. ఇబ్బందులు తప్పవని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మొక్కుబడిగా 6,500 పోస్టుల భర్తీకి నోటిఫికేసన్ ఇవ్వాలని నిర్ణయించింది.
లక్షల మంది ఎదురు చూపు..
తెలంగాణలో లక్షలాది మంది నిరుద్యోగులు ఏళ్లుగా ఎదురు చూస్తోన్న టీచర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన కీలక ప్రకటన రానే వచ్చేసింది. మంత్రి సబితారెడ్డి ఈ రోజు స్వయంగా ఆ వివరాలను వెల్లడించారు. ఈ సారి టీఎస్పీఎస్సీ టీఆర్టీ ద్వారా కాకుండా.. గతంలో మాదిరిగా డీఎస్సీ ద్వారా ఈ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.
జిల్లాల వారీగా నోటిఫకేషన్..
2017లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ద్వారా టీఆర్టీ నోటిఫికేషన్ ఇచ్చారు. అయితే లీగల్ సమస్యలు తలెత్తిన నేపథ్యంలో పోస్టు భర్తీలో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో ఈసారి డీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. నియామకాలకు సంబంధించి జిల్లాల వారీగా కలెక్టర్లు చైర్మన్‌గా ఉంటారని.. అడిషనల్ కలెక్టర్ వైస్ చైర్మన్‌గా, డీఈవో సెక్రటరీగా వ్యవహరిస్తారని తెలిపారు. రెండ్రోజుల్లోనే నోటిఫికేషన్, విధివిధానాలను విడుదల చేస్తామని మంత్రి వెల్లడించారు. కలెక్టర్లు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తారని ప్రకటించారు. డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా 6,500 పోస్టులను భర్తీ చేస్తామన్నారు. ఇందులో స్కూల్ ఎడ్యుకేషన్‌కు సంబంధించి 5,089 టీచర్ పోస్టులు, ప్రత్యేక విద్యార్థుల పాఠశాలల్లో 1523 స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీ చేయనున్నట్లు వివరించారు.