National

సనాతన వివాదం వేళ..హిందుత్వపై బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కీలక వ్యాఖ్యలు

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. శని, ఆదివారాల్లో ఈ సమ్మిట్‌ జరుగబోతోంది. దీని కోసం ఢిల్లీ ముస్తాబైంది.

ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ఈ శిఖరాగ్ర సదస్సు ఏర్పాటైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటినీ మువ్వన్నెల వెలుగులతో అలంకరించారు.

జీ20లో భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నాయి. ఆయా దేశాల ప్రతినిధులందరూ వచ్చే సంవత్సరం భారత్‌లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సి ఉంది.

ఈ సమావేశంలో పాల్గొనడానికి బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ ఈ మధ్యాహ్నం.. భారత్‌కు చేరుకున్నారు. శనివారం ఉదయం జో బైడెన్, జీ20 దేశాధినేతలు, ప్రధానమంత్రులు.. రాజ్‌ఘాట్‌ను సందర్శించనున్నారు. జాతిపిత మహాత్మాగాంధీకి నివాళి అర్పిస్తారు. అక్కడి నుంచి నేరుగా ప్రగతి మైదాన్‌కు చేరుకుంటారు. భారత్ మండపంలో జీ20 సదస్సులో పాల్గొంటారు.

ఈ సందర్భంగా ఆయన ప్రముఖ వార్తా సంస్థ ఏఎన్ఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు. హిందువుగా గర్విస్తున్నానని, తన మూలాలు అవేననీ అన్నారు. ఇక్కడున్న ఈ రెండు రోజుల్లో తీరిక చేసుకుని ఏదైనా ఒక ఆలయాన్ని సందర్శిస్తానని చెప్పారు. రాఖీ పండగనూ సంప్రదాయబద్ధంగా జరుపుకొన్నామని, రాఖీలన్నింటినీ జాగ్రత్తగా దాచి పెట్టుకున్నానని వ్యాఖ్యానించారు.

జీ20 సదస్సుకు రావాల్సిన ఉన్నందున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సరిగ్గా జరుపుకోలేకపోయానని, అందుకే ఏదైనా ఓ ఆలయాన్ని సందర్శిస్తానని పేర్కొన్నారు. భక్తి, విశ్వాసం అనేది అందరి జీవితాలను ప్రభావితం చేస్తుందని, అవే మనల్ని నడిపిస్తాయని తాను బలంగా నమ్ముతున్నానని చెప్పారు.

ప్రధానమంత్రి వంటి పదవిలో ఉన్నప్పుడు ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కొనాల్సి ఉంటుందని, అలాంటప్పుడు ఆత్మస్థైర్యాన్ని ఇవ్వడానికి, మనో బలాన్ని పెంచుకోవడానికి ఈ భక్తి విశ్వాసాలే ప్రధానంగా దోహద పడతాయని రిషి సునాక్ అభిప్రాయపడ్డారు. జీ20 సదస్సు.. భారత్‌లో జరగబోతోండటం తనకు సంతోషాన్ని ఇస్తోందని అన్నారు.

ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా చర్యలను రిషి సునాక్ తప్పు పట్టారు. దీన్ని అక్రమ యుద్ధంగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది ప్రజలపై ఇది ప్రభావాన్ని చూపుతోందని, ప్రత్యేకించి ఆహార ధరల పెరుగుదలకు కారణమౌతోందని అన్నారు. జీ20లో ఈ అంశాన్ని తాను ప్రస్తావిస్తానని చెప్పారు.

ఢిల్లీలో ఎయిర్ ఫోర్స్ వన్- జో బైడెన్ ల్యాండ్: బిజీ షెడ్యూల్

ఉక్రెయిన్ నుంచి ప్రపంచంలోని చాలా పేద దేశాలకు ఆహార ధాన్యాలను సరఫరా చేస్తోందని రిషి సునాక్ అన్నారు. రష్యా ఇటీవలే ధాన్యం ఒప్పందం నుంచి వైదొలిగిందని, ఫలితంగా వాటి ధరలు పెరగుతున్నాయని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాదిమంది దీనివల్ల ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. రష్యా చట్టవిరుద్ధంగా సాగిస్తోన్న యుద్ధం గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తానని అన్నారు.