National

ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది.

న్యూఢిల్లీ: ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 సమ్మిట్‌కు సర్వం సిద్ధమైంది. శని, ఆదివారాల్లో ఈ సమ్మిట్‌ జరుగబోతోంది. దీని కోసం ఢిల్లీ ముస్తాబైంది.

ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపంలో ఈ శిఖరాగ్ర సదస్సు ఏర్పాటైంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని నగరంలోని ప్రఖ్యాత కట్టడాలన్నింటినీ మువ్వన్నెల వెలుగులతో అలంకరించారు.

జీ20లో భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నాయి. ఆయా దేశాల ప్రతినిధులందరూ వచ్చే సంవత్సరం భారత్‌లో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సుకు హాజరు కావాల్సి ఉంది.

కాగా- ఈ సదస్సు ఏర్పాటైన నేపథ్యంలో ఢిల్లీ భద్రత మొత్తం అత్యంత కట్టుదిట్టంగా మారింది. ప్రత్యేకించి ఈ సదస్సు జరిగే ప్రగతి మైదాన్ పరిసరాల్లో కనివినీ ఎరుగని సెక్యూరిటీ వ్యవస్థను మోహరింపజేశారు. అయిదంచెల భద్రతను ఏర్పాటు చేశారు. సదస్సు ముగిసేంత వరకూ 24 గంటల పాటు ఈ భద్రత వ్యవస్థ కొనసాగుతుంది.

ఈ సమావేశంలో పాల్గొనడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. భారత్‌కు చేరుకున్నారు. ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. అమెరికా అధ్యక్షుడి అధికారిక విమానం ఎయిర్ ఫోర్స్ వన్.. కొద్దిసేపటి కిందటే ఢిల్లీలో దిగింది. ఈ నెల 10వ తేదీ వరకూ ఆయన భారత్‌లోనే ఉంటారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలతో పాటు జీ20 సమ్మిట్‌లో పాల్గొంటారు.

విమానాశ్రయం నుంచి జో బైడెన్ నేరుగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలుసుకోనున్నారు. ద్వైపాక్షిక సమావేశానికి హాజరవుతారు. ఆర్థిక, రక్షణ, వాణిజ్య రంగాలకు సంబంధించిన పలు ఒప్పందాలపైనా ఈ రెండు దేశాల అధికారులు సంతకాలు చేయనున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడంపైనా చర్చిస్తారు.