National

చివరి టోర్నీ ఇదేనంటూ.. రిటైర్మెంట్‌పై సానియా మీర్జా ఎమోషనల్ నోట్!

భారత టెన్నిస్ స్టార్, హైదరాబాద్ అందం ‘సానియా మీర్జా’ రిటైర్మెంట్ గురించి సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వినిపిస్తున్న విషయం తెలిసిందే. 2022 సీజన్‌తోనే టెన్నిస్ కెరీర్‌కి ముగింపు పలకబోతున్నట్టు గతంలో సానియా ప్రకటించినా.. గాయం కారణంగా ఆ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఇక దుబాయ్ ఓపెన్‌ 2023 తర్వాత సానియా రిటైర్మెంట్‌ ప్రకటిస్తారని నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. అన్ని వార్తలకు చెక్ పెడుతూ ఆస్ట్రేలియా ఓపెన్‌ 2023 తోనే రిటైర్మెంట్ తీసుకోబోతున్నట్టు తాజాగా సానియా ప్రకటించారు. 2023 జనవరి 16న ఆరంభం కానున్న ఆస్ట్రేలియా ఓపెన్‌ 2023 అనంతరం రిటైర్మెంట్ (Sania Mirza Retirement) ప్రకటిస్తున్నట్లు సానియా మీర్జా నేడు ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ నోట్ పోస్ట్ చేశారు. ఈ పోస్టుకు ‘లైఫ్ అప్‌డేట్’ అనే క్యాప్షన్ ఇచ్చారు. ‘ముప్పై సంవత్సరాల క్రితం హైదరాబాద్‌లోని నాజర్ పాఠశాలలో చదివే 6 ఏళ్ల బాలిక టెన్నిస్ ఆడాలనుకుంది. తన తల్లితో కలిసి తొలిసారి నిజాం క్లబ్‌లో టెన్నిస్‌ కోర్టుకు వెళ్లి ఎలా ఆడాలో నేర్చుకుంది. ఆరేళ్ల వయసులోనే తన కలల కోసం పోరాడడం మొదలెట్టింది. ఎన్నో కష్టాలు, సమస్యలు, ఇబ్బందులను అధిగమించి.. కెరీర్‌లో మొదటి గ్రామ్ స్లామ్ ఆడింది. దేశానికి ప్రాతినిథ్యం వహించే గొప్ప గౌరవాన్ని పొందింది’ అని సానియా పేర్కొన్నారు. ‘నేను ఇప్పుడు నా కెరీర్‌ను తిరిగి చూసుకుంటే.. 50 గ్రాండ్ స్లామ్స్‌ పైగా ఆడాను. దేవుడి దయతో కొన్ని టైటిల్స్ కూడా గెలిచాను.

టైటిల్స్ గెలుచుకోవడం నా అదృష్టం. పొడియంలో త్రివర్ణ పతాకంతో నిలబడడమే నాకు దక్కిన అత్యున్నత గౌరవం. టెన్నిస్ ఆట ప్రపంచవ్యాప్తంగా నాకు ఎంతో మంది అభిమానులను సంపాదించిపెట్టింది. ఈ లేఖ రాస్తున్నప్పుడు నా కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మరోవైపు గర్వంతో నా మనసు ఉప్పొంగింది. నాకు అండగా నిలిచిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. హైదరాబాద్ నుంచి వచ్చిన ఓ అమ్మాయి టెన్నిస్ ప్రపంచంలో ఎన్నో విజయాలు అందుకుందంటే.. అంత తేలికైన విషయం కాదు. నా కల సాకరం అవ్వడంలో తోడుగా నిలిచిన అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నా’ అని సానియా మీర్జా లేఖలో రాశారు. ’20 ఏళ్లుగా ప్రొఫెషనల్ అథ్లెట్‌గా ఉన్నా. 30 ఏళ్లుగా టెన్నిస్ ఆడుతున్నా. నా జీవితమే టెన్నిస్ అయిపోయింది. నా గ్రాండ్ స్లామ్ జర్నీని 2005లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌తో మొదలెట్టా. అందుకే ఆస్ట్రేలియన్ ఓపెన్‌తోనే నా కెరీర్ ముగించడం బాగుంటుందని భావించా’ అని 36 సంవత్సరాల భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా చెప్పుకొచ్చారు. సానియా కెరీర్‌లో ఆరు గ్రాండ్ స్లామ్‌లను సాధించారు. ప్రపంచ నంబర్ వన్ డబుల్స్ క్రీడాకారిణిగా కూడా నిలిచారు. సింగిల్స్‌నూ వరల్డ్‌ ర్యాకింగ్స్‌లో 27వ స్థానానికి చేరారు.