కేంద్రానికి సుప్రీం కోర్టు వరుస షాక్‌లు ఇస్తోంది. ఢిల్లీలో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వానికే అధికారాలు ఉంటాయని, మహారాష్ట్రలో గవర్నర్ తీరు సరిగా లేదని బుధవారం తీర్పు ఇచ్చిన దేశ అత్యున్నత న్యాయస్థానం..
బుధవారం మరో కీలక ఉత్తర్వులు జారీ చేసింది. గుజరాత్‌లో కింది కోర్టుల్లో పనిచేసే 68 మంది న్యాయమూర్తులకు ఆ రాష్ట్ర హైకోర్టు కల్పించిన పదోన్నతిపై దేశ అత్యున్నత న్యాయస్థానం స్టే విధించింది. వీరిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి జైలు శిక్ష విధించిన సూరత్ చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ హరీశ్ హస్ముఖ్‌భాయ్‌వర్మ కూడా ఉన్నారు. వీరి పదోన్నతి చట్ట విరుద్ధమంటూ సివిల్ జడ్జి కేడర్‌కు చెందిన న్యాయమూర్తులు సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మెరిట్ – కమ్ సీనియారిటీ ఆధారంగా కాకుండా సీనియారిటీ-కమ్ మెరిట్ ఆధారంగా నియామకాలు చేపట్టారని తెలిపారు. దీంతో వీరి పదోన్నతి చట్ట వ్యతిరేకమని సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.
విచారణ జరిపిన సుప్రీం కోర్టు..
సివిల్ జడ్జి కేడర్‌కు చెందిన న్యాయమూర్తులు వేసిన పిటిషన్‌పై గుజరాత్ ప్రభుత్వం, గుజరాత్ హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్‌కు నోటీసులు జారీ చేసింది. అయితే కోర్టు నుంచి నోటీసులు వచ్చినప్పటికీ.. గుజరాత్ ప్రభుత్వం ఆ న్యాయమూర్తులకు ప్రమోషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తాజాగా మరోసారి విచారణ జరిపిన అత్యున్నత న్యాయస్థానం.. గుజరాత్ ప్రభుత్వం తీరుపై అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసు కోర్టులో పెండింగ్‌లో ఉందని తెలిసి కూడా ప్రభుత్వం వారికి పదోన్నతి కల్పించడం దురదృష్టకరమని కోర్టు పేర్కొంది.
మధ్యంతర ఉత్తర్వులు..
”ఈ కోర్టు నిర్ణయానికి విభిన్నంగా ఆ న్యాయమూర్తులకు పదోన్నతి కల్పించడం చట్టవిరుద్ధం. ఆ ప్రమోషన్ జాబితా అమలుపై స్టే విధిస్తున్నాం. పదోన్నతి దక్కిన న్యాయమూర్తులు తిరిగి వారి గత పదవుల్లోకి వెళ్లిపోవాలి” అని కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై తగిన ధర్మాసనం తదుపరి విచారణ జరుపుతుందని స్పష్టం చేసింది.
‘మోదీ’ ఇంటిపేరు వ్యాఖ్యలపై రాహుల్‌కు శిక్ష
2019 నాటి ‘మోదీ’ ఇంటిపేరు వ్యాఖ్యలకుగానూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని సూరత్ కోర్టు దోషిగా తేల్చిన విషయం తెలిసిందే. న్యాయమూర్తి హస్ముఖ్‌వర్మ ఈ కేసును విచారించి.. రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ తీర్పుతో కాంగ్రెస్ నేత తన లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోవాల్సి వచ్చింది.