న్యూఢిల్లీ: దేశ రాజధాని వేదికగా- ప్రపంచ దేశాల్లో అత్యున్నత భేటీల్లో ఒకటిగా భావించే జీ20 శిఖరాగ్ర సదస్సు కొనసాగుతోంది. ప్రగతి మైదాన్‌లోని భారత్ మండపం దీనికి వేదిక.
జీ20లో సభ్య దేశాల అధ్యక్షులు, ప్రధానమంత్రులు ఈ భేటీకి హాజరయ్యారు. పలు కీలక అంశాలపై చర్చిస్తోన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ ఇమ్మానుయెల్ మక్రాన్, చైనా ప్రధాని లి కియాంగ్, దక్షిణాఫ్రికా అధినేత సిరిల్ రమాఫోసా.. ఇలా పలువురు ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యారు. కొద్దిసేపటి కిందటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వాగతోపన్యాసం చేశారు.
జీ20లో భారత్ సహా అర్జెంటీనా, ఆస్ట్రేలియా, బ్రెజిల్, కెనడా, చైనా, ఫ్రాన్స్, జర్మనీ, ఇండోనేషియా, ఇటలీ, జపాన్, రిపబ్లిక్ ఆఫ్ కొరియా, మెక్సికో, రష్యా, సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, టర్కీ, బ్రిటన్, అమెరికాతో పాటు యూరోపియన్ యూనియన్ దేశాలు ఇందులో సభ్యులుగా కొనసాగుతున్నాయి.
ఈ సమావేశంలో పాల్గొనడానికి బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునాక్ శుక్రవారమే భారత్‌కు చేరుకున్నారు. తన భార్య, ఇన్ఫోసిస్ నారాయణమూర్తి- సుధామూర్తి కుమార్తె అక్షత మూర్తితో కలిసి ఢిల్లీలో ల్యాండ్ అయ్యారు. ఈ మధ్యాహ్నం ప్రధాని మోదీతో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు.
కాగా- తాను హిందువుగా గర్విస్తున్నానని, తన మూలాలు అవేనంటూ రిషి సునాక్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో ఉన్న ఈ రెండు రోజుల్లో ఏదైనా ఓ ఆలయాన్ని సందర్శిస్తాననీ చెప్పారు. జీ20 సదస్సుకు రావాల్సిన ఉన్నందున శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను సరిగ్గా జరుపుకోలేకపోయానని, అందుకే ఏదైనా ఓ ఆలయాన్ని సందర్శిస్తానని పేర్కొన్నారు.
చెప్పినట్టే- రేపు ఢిల్లీలోని ప్రఖ్యాత స్వామి నారాయణ్ అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శించనున్నారు రిషి సునాక్. సీతారామచంద్రులు, రాధాకృష్ణులు, శివపార్వతులు, లక్ష్మీనారాయణుల ఆలయాలు ఇందులో ఉపాలయాలుగా ఉంటోన్నాయి. ఈ మందిరాన్ని ఆదివారం సాయంత్రం రిషి సునాక్, అక్షత సునాక్ సందర్శించనున్నారు.
ఢిల్లీ తూర్పు ప్రాంతంలోని పాండవ్ నగర్‌లో ఉంటుంది ఈ ఆలయం. గ్రేటర్ నొయిడా సరిహద్దులకు సమీపంలో ఉంటుంది. జీ20 సదస్సు ముగిసిన వెంటనే రిషి సునాక్ తన భార్య అక్షత సునాక్‌తో సహా అక్షర్‌ధామ్ ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం బ్రిటన్‌కు బయలుదేరి వెళ్తారు.