AP

తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు

అమరావతి: తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. అరెస్ట్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించింది. 2014-2019 మధ్యకాలంలో స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడిన ఆరోపణలను ఎదుర్కొంటోన్న నేపథ్యంలోచంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారు..

తగిన సాక్ష్యాధారాలతో సహా.

ఈ తెల్లవారు జామున నంద్యాల పర్యటనలో ఉన్న సమయంలో చంద్రబాబు అరెస్ట్ అయ్యారు. వైద్య పరీక్షల అనంతరం ఆయనను రోడ్డు మార్గంలో విజయవాడకు తరలించారు. సిటీ కోర్ట్‌లో ఆయనను ప్రవేశపెట్టారు. ఈ అరెస్ట్ పట్ల తెలుగుదేశం, జనసేన పార్టీ నాయకులు భగ్గుమంటోన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపునిచ్చారు.

మరోవంక- జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ కూడా విజయవాడకు రావడానికి చేసిన ప్రయత్నాలు ఉద్రిక్తతలకు దారి తీశాయి. తొలుత ఆయన ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు రావడానికి ప్రయత్నించినప్పటికీ.. తెలంగాణ పోలీసులు అడ్డుకున్నారు. పవన్ కల్యాణ్ ఫ్లైట్ ఎక్కడానికి అనుమతి ఇవ్వలేదు.

దీనితో రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి విజయవాడకు బయలుదేరారు. కొద్దిసేపటి కిందటే ఏపీ- తెలంగాణ సరిహద్దుల్లో ప్రవేశించారు. అక్కడ చుక్కెదురైంది. సరిహద్దుల్లో ఏపీ పోలీసులు ఆయన కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట నియోజకవర్గం గరికపాడు చెక్‌పోస్ట్ వద్ద పోలీసులు వాహనాలకు అడ్డుపడ్డారు.

అప్పటికే చెక్‌పోస్ట్ వద్ద భారీగా మోహరించారు పవన్ కల్యాణ్ అభిమానులు, జనసేన పార్టీ కార్యకర్తలు. కాన్వాయ్‌ను అడ్డుకోవడానికి ప్రయత్నించిన పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. పోలీసు చర్యలకు అడ్డుగా నిలిచారు. దీనితో పోలీసులు వారిని అదుపులోకి తీసుకోవడానికి ప్రయత్నించడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తమను అడ్డుకుంటోన్న పవన్ అభిమానులపై లాఠీ ఛార్జీకి దిగారు.

హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి కావడం వల్ల పెద్ద ఎత్తున వాహనాలు స్తంభించిపోయాయి. పోలీసులు అడ్డుగా పెట్టిన ప్లాస్టిక్ డ్రమ్ములను రోడ్డు పక్కకు లాగి పడేశారు. అడ్డంకులను తొలగించారు. కొద్దిసేపటి తరువాత పవన్ కల్యాణ్ కాన్వాయ్.. సరిహద్దులను దాటుకుని ఏపీలో ప్రవేశించింది.

ఈ సమయంలో పవన్ కల్యాణ్ కారులో నుంచి ఈ తతంగాన్ని చూస్తూ ఉండటం కనిపించింది. దీనికి సంబంధించిన ఓ వీడియోను నాదెండ్ల మనోహర్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఏపీకి వెళ్లడానికి విసా, పాస్ట్ పోర్ట్ అవసరం అయ్యేలా ఉంది.. అంటూ నవ్వుతూ కామెంట్స్ చేయడం ఈ వీడియోలో రికార్డయింది.