AP

బాబును రిమాండ్‌కు పంపిన జడ్జి భద్రతపై ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

రాజమండ్రి: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు.

ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.

2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఆయనను కస్టడీలోకి తీసుకుని, దర్యాప్తు సాగిస్తోన్నారు.

కాగా- ఈ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కేసులో చంద్రబాబును జ్యుడీషియల్ కస్టడీకి పంపించిన ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ సత్య వెంకట హిమబిందు భద్రత విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆమెకు అదనపు భద్రతను కల్పించింది. 4+1 ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు హోం మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలుస్తోంది.

చంద్రబాబును జ్యుడీషియల్ కస్టడీకి పంపించిన అనంతరం రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఆమెకు అదనపు భద్రతను కల్పించింది ప్రభుత్వం. తెలుగుదేశం పార్టీ సానుభూతిపరులు పెద్ద ఎత్తున సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌పై జస్టిస్ హిమబిందుకు వ్యతిరేకంగా పోస్టులు పెడుతోండటాన్నీ తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంది.

2016లో న్యాయమూర్తిగా ఎంపికైన హిమ బిందు ప్రారంభంలో తూర్పు గోదావరి జిల్లా అడిషనల్‌ డిస్ట్రిక్‌ అండ్‌ సెషన్స్‌ జడ్జిగా పని చేశారు. ఈ ఏడాది ఏప్రిల్‌ 18వ తేదీన ప్రిన్సిపల్‌ స్పెషల్‌ జడ్జిగా అపాయింట్ అయ్యారు. చంద్రబాబును రిమాండ్‌కు పంపడం అనే హైప్రొఫైల్‌ కేసు విషయంలో హిమబిందు ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థ పట్ల సామాన్యుల్లో నమ్మకాన్ని మరింత పెంచిందంటూ వైసీపీ చెబుతోంది.