National

ఉత్తర కొరియా అధినాయకుడు కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం రష్యాకు చేరుకున్నారు

ఉత్తర కొరియా అధినాయకుడు కిమ్ జోంగ్ ఉన్ మంగళవారం రష్యాకు చేరుకున్నారు. ఆయన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశం కానున్నారు. ఈ పర్యటనలో కిమ్ జోంగ్ ఉన్ రష్యాతో ఆయుధ ఒప్పందం చేసుకునే అవకాశం ఉందని అమెరికా ఆందోళ వ్యక్తం చేసింది.

క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ ప్రకారం, కిమ్ ఈ వారంలో రష్యాలోని ఫార్ ఈస్ట్ ప్రాంతంలో పేర్కొనబడని ప్రదేశంలో పుతిన్‌ను కలుస్తారు.

పుతిన్ ప్రస్తుతం ఉత్తర కొరియా సరిహద్దుకు దగ్గరగా ఉన్న ఫార్ ఈస్ట్ నగరమైన వ్లాడివోస్టాక్‌లోని ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్‌కు హాజరవుతున్నారు. మాస్కో ఉత్తర కొరియా నుంచి ఆర్టిలరీ షెల్స్, యాంటీ ట్యాంక్ క్షిపణులను కోరుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి రష్యన్ సైన్యానికి భారీ ప్రోత్సాహాన్ని ఇవ్వగలవు అమెరికా అంచనా వేస్తోంది. ఆయుధాలు ఇచ్చినందుకు బదులుగా కిమ్ జోంగ్ ఉన్ ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులు, అణు సామర్థ్యం గల బాలిస్టిక్ క్షిపణి జలాంతర్గాములు, సైనిక నిఘా ఉపగ్రహాలకు సంబంధించిన వాటితో సహా చాలా అవసరమైన శక్తి, ఆహార సహాయం, అధునాతన ఆయుధాల సాంకేతికతలను కిమ్ కోరవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఉక్రెయిన్‌లో వివాదానికి సంబంధించి రష్యాకు ఆయుధాలను సరఫరా చేస్తే ఉత్తర కొరియా “మూల్యం చెల్లించాల్సి ఉంటుంది” అని వైట్‌హౌస్ గత వారం హెచ్చరించింది. అమెరికా హెచ్చరికలను ధిక్కరిస్తూ కిమ్ ఆదివారం ఉత్తర కొరియా నుంచి రష్యాకు బయలుదేరినట్లు అధికారిక కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ తెలిపింది. ఆయుధాల ఉత్పత్తి, అంతరిక్ష సాంకేతిక పరిజ్ఞానానికి సంబంధించిన అధికారులతో సహా ఉత్తర కొరియా ఉన్నతస్థాయి సైనికాధికారులు ఆయన వెంట ఉన్నారు.

కొరియా పీపుల్స్‌ ఆర్మీ మార్షల్‌ పాక్‌ జోంగ్‌ చోన్‌, మ్యూనిషన్స్‌ ఇండస్ట్రీ డిపార్ట్‌మెంట్‌ డైరెక్టర్‌ జో చున్‌ ర్యాంగ్‌తో సహా తన సైనికాధికారులతో కలిసి కిమ్ రష్యాకు వెళ్తున్నట్లు విశ్లేషకులు తెలిపారు. కోవిడ్ -19 మహమ్మారి తర్వాత ఈ పర్యటన కిమ్ కు ఇది మొదటి విదేశీ పర్యటనగా ఉత్తర కొరియా పేర్కొంది.ఉత్తర కొరియా, రష్యా నేతలు ఈ నెలలోనే సమావేశం అయ్యే అవకాశం ఉందని అమెరికా ఇంటెలిజెన్స్‌ను ప్రకటన విడుదల చేసింది.