న్యూఢిల్లీ: మహిళా రిజర్వేషన్ బిల్లుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా బుధవారం సాయంత్రం పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై పలు పార్టీలు రాజకీయాలు చేశాయని..
కానీ, బీజేపీ, నరేంద్ర మోడీకి అలా కాదని అన్నారు. మహిళలకు తగిన ప్రాధాన్యతను ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. అందుకే మహిళా బిల్లును ప్రవేశపెడుతున్నామని చెప్పారు.
జనగణన, డీలిమిటేషన్‌పై ప్రతిపక్షాలు పట్టుబట్టడంపైనా అమిత్ షా స్పందించారు. వచ్చే(2024) సార్వత్రిక ఎన్నికలు ముగిసిన తర్వాత దేశంలో జనాభా లెక్కలు, డీలిమిటేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందని ఆయన స్పష్టం చేశారు. ఏయే సీట్లను రిజర్వ్ చేయాలనే దానిపై డీలిమిటేషన్ కమిషన్ మాత్రమే కాల్ చేయగలదని, అలాంటి నిర్ణయాలు తీసుకోవడానికి జనాభా లెక్కల డేటా మూలాధారమని ఆయన పేర్కొన్నారు.
మహిళా రిజర్వేషన్ బిల్లును పూర్తి పారదర్శకతతో తీసుకొస్తున్నామని అమిత్ షా చెప్పారు. బిల్లు విధాన రూపకల్పనలో మహిళా ప్రాధాన్యతతో ఉంటుందని స్పష్టం చేశారు. గతంలో పలుమార్లు పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టారని.. కానీ, ఆమోదానికి నోచుకోలేదన్నారు. కాంగ్రెస్ పార్టీ మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించేందుకు సరైన విధానాలు అవలంభించలేదన్నారు.
ఇప్పుడు తాము మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడుతుంటే అడ్డుకునే ప్రయత్నం చేయడం సరికాదన్నారు అమిత్ షా. మహిళా బిల్లుకు మద్దతు ఇస్తామంటూనే వ్యతిరేకిస్తున్నారని మండిపడ్డారు. దేశంలో మహిళలకు సముచిత స్థానం ఇచ్చేందుకే మోడీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెడుతోందని అమిత్ షా పేర్కొన్నారు. కాగా, బుధవారం రాత్రి పార్లమెంటులో మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఓటింగ్ ప్రారంభించారు.