APNational

రూపాయి పావలా ప్రభుత్వం; చచ్చు తెలివితేటలు, కులరాజకీయాలు: భగ్గుమన్న పవన్ కళ్యాణ్!!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి విజయ యాత్రలో భాగంగా కృష్ణాజిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో నేడు పెడనలో పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర కొనసాగింది.

ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసిన పవన్ కళ్యాణ్ ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. సీఎం జగన్ ది రూపాయి పావలా ప్రభుత్వమని పవన్ కళ్యాణ్ విమర్శించారు.

కేవలం ఓట్ల కోసమే వైసీపీ పథకాలను తీసుకొస్తుందని, అమలుకు వచ్చేసరికి అంతా డొల్లతనం మాత్రమే కనిపిస్తుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. వైసిపిని గద్దె దించడం కోసమే తెలుగుదేశం పార్టీతో జత కట్టామని 2024లో జనసేన, టిడిపి ప్రభుత్వం రాబోతుందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఏపీకి టిడిపి అనుభవం, జనసేన యువరక్తం అవసరమని పేర్కొన్న ఆయన తాను ఎన్డీఏలో భాగస్వామిని అయినప్పటికీ రాష్ట్ర భవిష్యత్తు కోసం టిడిపికి మద్దతు తెలిపానని పేర్కొన్నారు.

39 కేసుల్లో నిందితుడైన జగన్ రాజకీయాలకు అనర్హుడని మండిపడ్డారు. జగన్ ను ఎప్పటికీ రాజకీయాల్లోకి రానివ్వకూడదు అని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. జగన్ ప్రభుత్వం ఉపాధి కూలీల పొట్ట కొట్టారని పవన్ కళ్యాణ్ దుయ్యబట్టారు. రూ. 336కోట్ల నిధులను దారి మళ్ళించారని ఆరోపణలు గుప్పించారు. ఇళ్ళ పేరుతో 4 వేల కోట్లు దోచేశారన్నారు.

ఏపీలో కుల భావన ఎక్కువ ఉందని, జాతీయ భావం తక్కువని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. కులాలుగా విడదీసి రాజకీయాలు చేయటానికి తాను రాలేదని పేర్కొన్నారు. జగన్ తన చచ్చు తెలివితేటలతో తన కులం వాళ్ళతోనే తనను తిట్టిస్తారని పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. అక్రమ ఇసుక మాఫియాను అడ్డుకున్న జనసేన, టీడీపీ కార్యకర్తలపై కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు.

రాష్ట్ర హక్కుల సాధనలో ఢిల్లీలో పోరాడే శక్తి జగన్‌కు ఏ మాత్రం లేదన్నారు. విభజన సమయంలో మూలన దాక్కుని ఫ్లకార్డులు పట్టుకున్న వ్యక్తి జగన్ అని పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. జగన్ ఒంట్లో పావలా దమ్ములేదు అని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. జగన్ పాలన ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కాదు, రాష్ట్రానికి వచ్చిన విపత్తు అంటూ మండిపడ్డారు.కైకలూరు, పెడన, మచిలీపట్నం, అవనిగడ్డ నియోజకవర్గాల అభివృద్ధికి జనసేన “చతుర్ముఖ వ్యూహం” తో ముందుకు వెళ్తుందన్నారు.