సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ.. ప్రకాశం జిల్లా పర్యటనలో ఉన్నారు.. ఆమె ఈ రోజు ఉదయం ఒంగోలులోని మాజీమంత్రి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి నివాసానికి వెళ్లారు..
బాలినేని కుటుంబ సభ్యులతో కలసి అల్పాహారం తీసుకున్నారు.. ఇక, శుక్రవారం రోజు వైవీ సుబ్బారెడ్డి తల్లి పిచ్చమ్మను పరామర్శించేందుకు ఒంగోలు వెళ్లారు వైఎస్ విజయమ్మ.. నిన్న పిచ్చమ్మను పరామర్శించిన ఆమె.. ఈ రోజు బాలినేని నివాసానికి వెళ్లారు.. విజయమ్మ రాకతో సందడిగా మారిపోయింది బాలినేని నివాసం.. కాగా, వైవీ సుబ్బారెడ్డి కుటుంబం, బాలినేని కుటుంబం వైఎస్ ఫ్యామిలీకి బంధువులైన విషయం విదితమే.
కాగా, బాలినేని శ్రీనివాస్ రెడ్డి సుదీర్ఘకాలంగా రాజకీయాల్లో కొనసాగుతున్నారు.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వెంటే నడిచారు.. ఒంగోలు నుండి ఐదుసార్లు శాసనసభ సభ్యుడుగా విజయం సాధించారు.. ఇక, రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి టీడీపీ ప్రభుత్వం ఏర్పడినా.. ఆ తర్వాత ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించగా.. వైఎస్ జగన్ తొలి కేబినెట్‌లోనూ మంత్రిగా బాలినేని శ్రీనివాస్‌రెడ్డి పనిచేసిన విషయం విదితమే.. ఇప్పుడు ఒంగోలు, బాపట్ల, నెల్లూరు, తిరుపతి, వైఎస్ఆర్ జిల్లాలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రాంతీయ సమన్వయకర్తగా బాధ్యతలు చూస్తున్నారు బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.