: నంద్యాల జిల్లా దొర్నిపాడులో జగనన్నకు చెబుదాం కార్యక్రమాన్ని నిర్వహించారు. కాగా ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ మనజీర్ జిలాని సామూన్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి హాజరైయ్యారు.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ హఠాత్తుగా కార్యక్రమం వద్దకు విచ్చేసారు. ఈ నేపథ్యంలో కేసీ కెనాల్ రైతుల సాగునీటి సమస్యను పరిష్కరించాలని భూమా అఖిల ప్రియ కలెక్టర్ ను కోరారు. అనంతరం స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్ర రెడ్డి పాల్గొనడం పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు సమస్యలు తెలుపుకునే స్పందన కార్యక్రమంలో కొంచెం కూడా ఇంకిత జ్ఞానం లేకుండా ఎమ్మెల్యే ఎలా కూర్చుంటాడు..? ప్రజలు ఎమ్మెల్యే పైన, అతని అనుచరుల పైన ఫిర్యాదు చెయ్యాలి అనుకుంటే ఎలా చెయ్యగలరు ? ఆ మాత్రం ఆలోచించకుండా ఒక బాధ్యతాయుత పదవిలో ఉండి ఇలా ఎలా ప్రవర్తిస్తారు అని ప్రశ్నించారు?
అలానే కలెక్టర్, సంబంధిత అధికారులు మాత్రమే కూర్చోవాల్సిన స్పందన కార్యక్రమంలో ఎమ్మెల్యే కూర్చోవడం కేవలం ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం కోసమే అని ఆరోపించారు. ఎమ్మెల్యే ఇక్కడ కాదు కూర్చోవాల్సింది.. విజయవాడకు వెళ్లి జగన్ దగ్గర కూర్చుని రైతులకు సాగునీరు అందించే ప్రయత్నం చేయాలి. అది వదిలేసి ఇక్కడ కూర్చోవడం సబబుకాదని పేర్కొన్నారు. ఎమ్మెల్యే ప్రజల కోసం పనిచేయడం లేదని. కేవలం తన స్వలాభం చూసుకుంటూ కమిషన్ల కోసం పనిచేస్తున్నాడు అని ఆమె ఆరోపించారు. జగన్ ప్రకటించిన 100 కోట్లు తీసుకురావడం ఆళ్లగడ్డ ఎమ్మెల్యేకు చేతకాదని వ్యాఖ్యానించారు. అలానే రైతులకు సాగునీరు తెప్పించడం మీకు చేతకాకపోతే పక్కన కూర్చోండి, సాగు నీరు తెప్పించి సమస్యను ఎలా పరిష్కరించాలో మేము చూపిస్తాం అని ఆగ్రహం వ్యక్తం చేశారు.