AP

పవన్ వారాహి టూర్ స్పెషల్ ! పొత్తు తర్వాత తొలిసారి-గ్రౌండ్లో జనసేనతో పాటు టీడీపీ !

ఏపీలో చంద్రబాబు అరెస్టు తర్వాత రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. చంద్రబాబును స్కిల్ స్కాంలో అరెస్టు చేసి రాజమండ్రి జైల్లో పెట్టిన తర్వాత అక్కడికి వెళ్లి పరామర్శించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ..

అక్కడే పొత్తు కూడా ప్రకటించేశారు. తద్వారా టీడీపీ శ్రేణుల్లోనూ స్ధైర్యం సన్నగిల్లకుండా చేశారు. ఇప్పుడు అక్టోబర్ 1 నుంచి వారాహి నాలుగో దశ యాత్రను కూడా ప్రారంభించడం ద్వారా ఇరు పార్టీల శ్రేణుల్ని ఉమ్మడిగా తనవైపు తిప్పుకునేలా ప్రయత్నిస్తున్నారు.

చంద్రబాబు అరెస్టు తర్వాత పవన్ కళ్యాణ్ చేసిన పొత్తు ప్రకటనతో అప్పటివరకూ మొహమాటంగా క్షేత్రస్ధాయిలో కలిసితిరిగిన టీడీపీ, జనసేన శ్రేణులు ఇప్పుడు బహిరంగంగా పూర్తి స్ధాయిలో కలిసి పనిచేసేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకోసం ఇరు పార్టీలు జాయింట్ యాక్షన్ కమిటీ ఏర్పాటుకు కూడా సిద్ధమవుతున్నాయి. టీడీపీ నుంచి యనమల రామకృష్ణుడు, జనసేన నుంచి నాదెండ్ల మనోహర్ ఈ కమిటీలో కీలక ప్రతినిధులుగా ఉంటారు. ఆ తర్వాత మరికొందరు సభ్యులు కూడా ఉంటారు. త్వరలో దీనిపై క్లారిటీ రాబోతోంది.

అదే సమయంలో టీడీపీకి పట్టుందని భావించే కృష్ణాజిల్లాలో ప్రారంభమవుతున్న వారాహి యాత్రకు ఈసారి క్రేజ్ పెరుగుతోంది. రెండు రోజుల్లో ప్రారంభమయ్యే ఈ యాత్ర జిల్లాలోని అవనిగడ్డ నుంచి ప్రారంభమవుతుంది. అవనిగడ్డ, బందరు, పెడన వంటి వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో సాగే ఈ యాత్రకు టీడీపీ-జనసేన శ్రేణులు తొలిసారి ఉమ్మడిగా దర్శనం ఇవ్వబోతున్నాయి. దీంతో పవన్ టూర్ భారీగా సాగే అవకాశముందని తెలుస్తోంది. ఇందుకోసం జనసేన నేత నాదెండ్ల మనోహర్ ఇవాళ పార్టీ కార్యాలయంలో జిల్లాల నేతలతో చర్చిస్తున్నారు.

చంద్రబాబు అరెస్టుతో ఆయన జిల్లా పర్యటనలు ఆగిపోవడం, అలాగే నారా లోకేష్ యువగళం యాత్ర కూడా ఆగిపోయిన నేపథ్యంలో పవన్ కళ్యాణ్ వారాహి టూర్ పై అంచనాలు పెరుగుతున్నాయి. పవన్ కళ్యాణ్ మొత్తం విపక్షం భారాన్ని మోస్తూ ఈ టూర్ కొనసాగించాల్సిన పరిస్దితి. అలాగే టీడీపీ-జనసేన పొత్తు తర్వాత పవన్ కళ్యాణ్ చేస్తున్న తొలి పర్యటన కావడంతో దీన్ని సక్సెస్ చేసేందుకు ఇరు పార్టీలు ప్రయత్నించే అవకాశం ఉంది. అదే సమయంలో ఈ టూర్ లో పవన్ కళ్యాణ్ చేసే వ్యాఖ్యలు ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకు తగ్గట్టుగానే వైసీపీ కూడా సిద్ధమవుతోంది.