అమరావతి: అనకాపల్లి జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి బండారు సత్యనారాయణ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఆయనను అదుపులోకి తీసుకోవడానికి పెద్ద సంఖ్యలో పోలీసులు అనకాపల్లిలోని ఆయన నివాసానికి చేరుకున్నారు.
ఈ విషయం తెలిసిన వెంటనే స్థానిక ఆయన అనుచరులు, టీడీపీ నాయకులు భారీగా ఆయన ఇంటికి రావడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.
పర్యాటక శాఖ మంత్రి ఆర్ కే రోజాపై బండారు సత్యనారాయణ అసభ్యకర, జుగుప్సాకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఆయనపై కేసు నమోదైంది. ఈ కేసులో ఆయన అరెస్ట్ కూడా అయ్యారు. బెయిల్‌పై విడుదల అయ్యారు. బండారు సత్యనారాయణపై రోజాపై చేసిన వ్యాఖ్యల పట్ల తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమ భగ్గుమంటోంది.
ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం ఈ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఓ మహిళపై బండారు సత్యనారాయణ అనే ఒకడు రోజాపై ఆరోపణలు చేస్తోంటే ఇంతకన్నా స్త్రీలని అవమానించడం ఇంకేముంటుందంటూ మండిపడ్డారు. బండారుపై అటు ప్రముఖ నటి, తమిళనాడు బీజేపీ నాయకురాలు ఖుష్బూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేశారు.
తాజాగా తమిళనాడుకే చెందిన నటి రాధిక శరత్‌కుమార్ సైతం బండారు సత్యనారాయణపై నిప్పులు చెరిగారు. ఓ సెల్ఫీ వీడియోను ఆమె తన అధికారిక ఎక్స్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. మనుషులుగా బతకండి అంటూ తెలుగుదేశం పార్టీ నాయకులకు హితబోధ చేశారు. సభలు, సమావేశాలు, రాజకీయాలు చేయడానికి టీడీపీ నాయకులు బయటికి వెళ్లినప్పుడు వాళ్ల ఇళ్లల్లో ఏం జరుగుతుందో వాళ్లకి తెలుసా? అంటూ నిలదీశారు.
రాజకీయాల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కల్పించడానికి ఉద్దేశించిన బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించుకున్న ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అదే మహిళలను కించపరచడం ఏ మాత్రం సహించరానిదని, వాళ్లు చేసిన తప్పును క్షమించడం కూడా సరికాదని అన్నారు.
ఈ విషయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఓ మహిళ, గృహిణిగా, బాధ్యత గల మంత్రిగా రోజాపై టీడీపీ నాయకులు చేసిన వ్యాఖ్యలపై సభ్య సమాజం స్పందించాల్సిన అవసరం ఉందని రాధిక శరత్ కుమార్ పేర్కొన్నారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలనీ అన్నారు.