దోమల ద్వారా వ్యాప్తి చెందే చికన్‌గున్యాకు తొలి టీకా అందుబాటులోకి రానుంది. నవంబర్ నెలలోనే ఇది మార్కెట్లోకి విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే ప్రపంచంలో సగం దేశాలకు కలవరం కలిగిస్తున్న చికన్‌గున్యా మరిన్ని దేశాలకు పాకే ముప్పు పొంచి ఉంది. ఈ తరుణంలో వ్యాక్సిన్‌కు యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్(FDA) ఆమోదం తెలపడం ఊరటనిచ్చే విషయం.
ఫ్రెంచి డ్రగ్ కంపెనీ వాల్నెవా ఈ టీకాను తయారు చేసింది. తొలుత అమెరికా ట్రావెలర్లు, సీనియర్ సిటిజన్లకు వ్యాక్సిన్ ను అందజేసే అవకాశాలు ఉన్నాయి. ఎఫ్‌డీఏ అనుమతులు వచ్చినందున అమెరికాతో పాటు వ్యాధి తీవ్రత ఉన్న దేశాలకూ వ్యాక్సిన్‌ను సరఫరా చేయొచ్చని భావిస్తున్నారు. టాంజేనియాలో 1952లో తొలిసారిగా చికన్‌గున్యా వ్యాపించింది. తూర్పు ఆఫ్రికా భాష కిమెకాండ్లో చికన్‌గున్యా అంటే కీళ్లను వంచేసే వ్యాధి అని అర్థం. మరణం సంభవించడమనేది అరుదే అయినా.. చికన్‌గున్యా వైరస్ వల్ల దీర్ఘకాలం పాటు కీళ్ల నొప్పులు ఉంటాయి. ఈ వ్యాధి బారిన పడిన వారిలో 40% మందిని ఈ నొప్పులు అల్లాడించేస్తాయి. వాల్నెవా చేపట్టిన ట్రయల్స్‌లో వ్యాక్సిన్ సానుకూల ఫలితాలను ఇచ్చింది. సింగిల్ డోస్ తీసుకున్న వారిలో 99% మందిలో యాంటీబాడీలు ఉత్పత్తి అయినట్టు తేలింది. దీర్ఘకాలం మనగలిగే ఆ యాంటీబాడీలను వైరస్‌ను సమర్థంగా ఎదుర్కొన్నట్టు టీకా ప్రయోగాల్లో తేలింది.
ఈ ఏడాది ఇప్పటివరకు నమోదైన 4,40,000 చికన్‌గున్యా కేసుల్లో 75% బ్రెజిల్, పరాగ్వే దేశాల్లోనే ప్రబలాయి. అమెరికా ట్రావెలర్లకు ఈ టీకా డోసును 350 డాలర్లకు విక్రయించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర దేశాలకు ఎంత రాయితీతో వ్యాక్సిన్ అందజేయాలనే అంశం ఇంకా ఖరారు కానప్పటికీ.. డోసు ధర 10 నుంచి 20 డాలర్లు ఉండొచ్చని తెలుస్తోంది.