Technology

ఫేక్ డెలివరీ.. కాల్ ఫార్వార్డింగ్..సైబర్ మాఫియా నయా దందా

టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న ఈ ఆధునిక యుగంలో సైబర్ నేరస్తుల ఆగడాలు మరింత ఎక్కువవుతున్నాయి. ఓటీపీలతో బ్యాంక్ అకౌంట్లలో డబ్బులు కొట్టేయడం, ఫేక్ స్కానర్ తో ఫోన్ పే, గూగుల్ పే ల ద్వారా డబ్బులు దోచుకోవడం, విదేశాల నుంచి పార్శిల్ వచ్చిందని.. ఇలా ఒకటేమిటి.. ఎన్నో స్కామ్ లు చేస్తూ ప్రజలను నిలువునా దోచుకుంటున్నారు. ఇప్పుడు ఫేక్ డెలివరీ కాల్ చేసి.. డెలివరీ బాయ్ కు కాల్ చేయాలంటే ఈ కోడ్ ఎంటర్ చేయండంటూ తమ కస్టమర్లకు సైబర్ నేరస్తులు కాల్స్ చేస్తున్నారని రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ సహా ఇతర టెలికాం ఆపరేటర్లు వినియోగదారులను హెచ్చరించారు. ఈ కాల్ ఫార్వార్డింగ్ స్కామ్ నుంచి జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

 

ఏంటీ ఈ కాల్ ఫార్వార్డింగ్.. ఆ కోడ్ ఎంటర్ చేస్తే ఏమవుతుంది ?

 

మొదట మీకొక ఫోన్ కాల్ వస్తుంది. అవతల మాట్లాడే వ్యక్తి మీకు పార్శిల్ వచ్చింది. డెలివరీ బాయ్ మిమ్మల్ని కాంటాక్ట్ చేయడానికి వీలుకావడం లేదు. మీరు డెలివరీ బాయ్ ను సంప్రదించాలంటే ఈ కోడ్ ఎంటర్ చేయండని చెప్తారు. ఆ కోడ్ 401. ఈ కోడ్ ఎంటర్ చేస్తే.. ఇక మీ ఫోన్ పూర్తి ఆపరేటింగ్ సైబర్ కేటుగాళ్ల చేతిలోకి వెళ్లిపోతుంది. మీకు వచ్చే ఫోన్ కాల్స్ నుంచి మెసేజ్ ల వరకూ అన్ని వాళ్లకి తెలుస్తాయి. బ్యాంక్ ఖాతాల్లో ఉన్న సొమ్ముని కాజేయడమే ఈ కాల్ ఫార్వార్డింగ్ స్కామ్ లక్ష్యం. మీకు ఇలాంటి కాల్ ఏమైనా వస్తే.. వెంటనే కట్ చేయండి. డెలివరీ వచ్చిందనగానే.. ఏమిస్తారోనన్న ఎగ్జైట్ మెంట్ తో కోడ్ ఎంటర్ చేశారా.. ఇక అంతే సంగతులు.

 

మరికొందరు స్కామర్ లు చాలా తెలివిగా వ్యవహరిస్తారు. మీ మొబైల్ ఇంటర్నెట్, బ్రాడ్ బ్యాండ్ సమస్యల గురించి ఆరా తీస్తారు. బాధితుడి ఖాతాలో సమస్యలున్నాయని, సిమ్ కార్డు మార్చుకోవాలని అందుకోసం ఇలా చేయండంటూ తమ తెలివిని ప్రదర్శిస్తారు. వారి మాటలు నమ్మి మీ స్మార్ట్ ఫోన్ లో 401 కోడ్ ఎంటర్ చేస్తే.. మీ ఇంటిలో భద్రంగా ఉన్న బీరువా తాళాలను దొంగ చేతికి అప్పగించినట్లే. ఇన్ కమింగ్ కాల్స్, పర్సనల్ మెసేజ్ లు, మొబైల్ బ్యాంకింగ్ ఓటీపీ, ఆఖరికి వాట్సాప్ సందేశాలు.. ఇలా అన్నింటి యాక్సెస్ స్కామర్ చేతికి వెళ్లిపోతుంది. మీకు వచ్చే ప్రతి కాల్ స్కామర్ కు ఫార్వర్డ్ అవుతుంది. ఆ విషయం బాధితుడు గ్రహించే అవకాశం కూడా ఉండదు. ఈ స్కామ్ ప్రధాన లక్ష్యం అడ్డదారిలో ఆర్థిక లాభం పొందడమే. సున్నితమైన సమాచారాన్ని, ఆన్ లైన్ మోసాలను అరికట్టేందుకు బ్యాంకులు అధునాతన పద్ధతుల్ని అనుసరిస్తుంటే.. సైబర్ కేటుగాళ్లు అంతకుమించిన టెక్నాలజీని ఉపయోగించి డబ్బులు కొట్టేస్తున్నారు.

 

కాల్ ఫార్వార్డింగ్ స్కామ్ నుంచి ఎలా సురక్షితంగా ఉండాలి ?

 

– డయలింగ్ కోడ్స్ లేదా ఎస్ఎంఎస్ లను పంపడం మానేయాలి

 

– తెలియని నంబర్ల నుంచి వచ్చిన మెసేజ్ లకు అనవసరంగా స్పందించడం మానుకోవాలి. అలాగే ప్రతి మెసేజ్ కు స్పందించాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా కోడ్ లు, తెలియని నంబర్లను డయల్ చేయరాదు.

 

– మీ స్మార్ట్ ఫోన్ సేఫ్ గా ఉండేందుకు పాస్ కోడ్ లు, బయోమెట్రిక్ పద్ధతులను ఉపయోగించండి. అనధికార యాక్సెస్ ను తగ్గించాలి.

 

– ఓటీపీలు వంటి సున్నితమైన సమాచారాన్ని షేర్ చేయాల్సి వస్తే.. ముందుగా వారి గుర్తింపును ధృవీకరించాలి. వీలైనంత వరకూ ఓటీపీలను ఎవరికీ షేర్ చేయకపోవడం ఉత్తమం. సైబర్ నేరగాళ్లు ఉపయోగించే ఈ మోసపూరిత వ్యూహాల బారిన పడకుండా ఉండేందుకు స్మార్ట్ ఫోన్ వినియోగదారులు జాగ్రత్తగా ఉండాలి.