TELANGANA

బీజేపీ, బీఆర్ఎస్ మధ్య రహస్య ఒప్పందాలు…

తెలంగాణ బీజేపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఎన్నికల ముందు కీలక నేతలంతా కాంగ్రెస్ లోకి క్యూ కడుతున్నారు. కేసీఆర్ సర్కార్ పై బీజేపీ ప్రదర్శిస్తున్న సాఫ్ట్ కార్నర్ ను చూడలేకే తాము పార్టీ మారుతున్నామని వారు చెబుతున్నారు. తెలంగాణ కాంగ్రెస్‌లో గతంలో కీలక పాత్ర పోషించి వేర్వేరు కారణాలతో పార్టీ మారిన కీలక నేతలంతా ఇప్పుడు ఘర్ వాపసీ అంటూ హస్తం పార్టీలో ఫుల్ జోష్ నింపుతున్నారు.

 

ప్రస్తుతం తెలంగాణ బీజేపీలో అసంతృప్తితో ఉన్న నేతల్లో మొన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, తాజాగా వివేక్ వెంకటస్వామి వచ్చి చేరారు. కేసీఆర్ సర్కార్ పై బలంగా పోరాడుతారన్న ఉద్దేశంతో అప్పట్లో రాజగోపాల్ రెడ్డి, వివేక్ సహా మరికొందరు నేతలు కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో జాయిన్ అయ్యారు. సీన్ కట్ చేస్తే పరిస్థితులన్నీ మారిపోయాయి.

 

బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఘాటుగా ప్రశ్నించే బండి సంజయ్‌ని అనుకోకుండా తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవి నుంచి తప్పించారు. లిక్కర్ స్కాంలో కవిత అరెస్ట్ కాకపోవడాన్ని ఆ నేతలు బహిరంగంగానే ప్రశ్నించారు. అలాగే కాళేశ్వరం అవినీతిపై మాట్లాడకపోవడం, కేసీఆర్ పై చర్యల దిశగా ప్రయత్నాలు లేకపోవడం. ఇవ్వన్నీ బీజేపీ చేయడానికి కేసీఆర్‌తో రహస్య ఒప్పందమే కారణమని బీజేపీ వీడుతున్న నేతలు చెబుతున్నారు.

 

తాజాగా వివేక్ వివేక్ వెంకటస్వామి రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లోకి చేరారు. వివేక్ వెంకటస్వామి బీజేపీ మ్యానిఫెస్టో కమిటీ ఛైర్మన్ గా ఉన్నారు. కిషన్ రెడ్డికి రాజీనామా లెటర్ పంపించి రాహుల్ సమక్షంలో వివేక్‌తో పాటు కుమారుడు వంశీకృష్ణ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. మొన్నటికి మొన్న టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి వివేక్ ను కలిసి వచ్చారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే కూడా వివేక్ తో ఫోన్లో మాట్లాడారు.

 

సరిగ్గా ఎన్నికల ముందు వివేక్ బీజేపీని వీడడంతో ఆ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. వివేక్ కుటుంబం తిరిగి కాంగ్రెస్ లో చేరడంతో తెలంగాణ కాంగ్రెస్ కు వెయ్యి ఏనుగుల బలం వచ్చినట్లయిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబంతో వెంకటస్వామి కుటుంబానికి 3 తరాల అనుబంధం ఉందని అన్నారు. అందరి లక్ష్యం కేసీఆర్ ను గద్దె దింపడమే అన్నారు.

 

రాక్షస పాలన అంతమొందించేందుకే కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వివేక్ ప్రకటించారు. తనకు టికెట్ ముఖ్యం కాదని, కేసీఆర్ పాలనకు చరమగీతం పాడడమే లక్ష్యం అన్నారు.

 

కేసీఆర్ సర్కార్ పై బీజేపీ తీసుకున్న చర్యలపై అసంతృప్తితో ఉన్న నేతలంతా ఇటీవలి కాలంలో వరుసగా రహస్య సమావేశాలు నిర్వహించుకున్నారు. కేసీఆర్ సర్కార్ టార్గెట్ గా యాక్షన్ ప్లాన్ ఎలా ఉండాలో ఆలోచించుకున్నారు. అప్పట్లో ఈ ఘటన సంచలనమే సృష్టించింది. ఆ నేతలు పార్టీ మారడం ఖాయమని అంతా అనుకున్నారు. ఇప్పుడు వరుసగా ఒక్కొక్కరు బీజేపీకి గుడ్ బై చెబుతున్నారు.

 

కేసీఆర్ ను గద్దె దించే సత్తా ఒక్క బీజేపీకి మాత్రమే ఉందన్న నమ్మకంతో ఆ పార్టీలో చేరానని.. కానీ ఆ లక్ష్యం నెరవేరలేదన్నారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అందుకే మళ్లీ సొంత గూటికి చేరాల్సి వచ్చిందన్నారు. రాజగోపాల్ పార్టీ మార్పుపై మొన్నటికి మొన్న తెలంగాణ బీజేపీ నేతలు సీరియస్ అయ్యారు. పాసింగ్ క్లౌడ్స్ మాదిరి కొందరు ఉన్నారని కౌంటర్లు వేశారు.

 

కేసీఆర్ వ్యతిరేక శక్తుల పునరేకీకరణలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కీలకంగా పని చేస్తున్నారు. అందరూ ఒక్కతాటిపైకి రావాలని గతంలోనే కోరారు. అవసరమైతే తాను పది మెట్లు దిగేందుకు కూడా సిద్ధమన్నారు. ఇది బీజేపీ అసంతృప్త నేతలను బాగా ఆకర్షించింది. అందుకే వరుసగా నేతలు కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారని రాజకీయ పరిశీలకుల అభిప్రాయం. మొన్నటికి మొన్న కాంగ్రెస్‌లో చేరికలపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు రేవంత్‌రెడ్డి. ఇతర పార్టీల్లోకి వెళ్లిన నాయకులు.. బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని తెలిసి తిరిగి వస్తున్నారన్నారు. కొందరి పేర్లు తీసుకుని మరీ చెప్పారు.

 

కాంగ్రెస్ లో చేరే నేతలు ఇంకొంత మంది ఉన్నారని, త్వరలోనే అనూహ్యమార్పులు జరుగుతాయని తెలంగాణ కాంగ్రెస్ నేతలు అంచనా వేస్తున్నారు.