పబ్లిక్ సర్వెంట్స్ , ప్రజాప్రతినిధులకు సంబంధించిన క్రిమినల్ కేసులను పరిష్కరించడానికి.. ప్రత్యేక కోర్టులను ఏర్పాటు చేయాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిఐఎల్)పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై 5,175 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, అందులో 40 శాతం.. అంటే 2,116 కేసులు కనీసం ఐదేళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయని హైకోర్టుల డేటాను పిల్ ప్రస్తావించింది. పిటిషనర్ల అభ్యర్థనపై, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్..ఈ ప్రజాప్రతినిధులపై కేసుల విచారణ కోసం ప్రత్యేక బెంచ్ లు ఏర్పాటు చెయ్యాలని హైకోర్టులను ఆదేశించింది. ఏకరీతి మార్గదర్శకాలను రూపొందించడం కష్టమని కోర్టు అభిప్రాయపడింది.
ప్రజాప్రతినిధులపై క్రిమినల్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఆయా రాష్ట్రాల నుంచి ఎన్నికైన ఎంపీలు, ఎమ్మెల్యేలపై పెండింగ్‌లో ఉన్న కేసులను త్వరితగతిన పరిష్కరించేందుకు.. సుమోటో ప్రొసీడింగ్స్‌ను ప్రారంభించాలని సుప్రీంకోర్టు హైకోర్టులను ఆదేశించింది. కేసుల పరిష్కారాన్ని పర్యవేక్షించాలని హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులకు సుప్రీంకోర్టు సూచించింది. ఇందుకోసం ప్రత్యేక బెంచ్ లను ఏర్పాటు చెయ్యాలని సుప్రీమ్ కోర్టు ఆదేశించింది.
తీవ్రమైన నేరాల విషయంలో, ట్రయల్ కోర్టులు విచారణను వాయిదా వేయకూడదని సుప్రీంకోర్టు తెలిపింది. కేసుల సత్వర పరిష్కారానికి వెబ్‌సైట్‌ను సిద్ధం చేయాలని ఆదేశించింది. దోషిగా తేలిన ఎంపీ, లేదా ఎమ్మెల్యే ఎన్నికల్లో పోటీ చేయకుండా జీవితకాల నిషేధంపై ఇంకా విచారణ జరుపుతామని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై తామింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపింది. తీవ్రమైన నేరాలకు పాల్పడిన ఎంపీలు లేదా ఎమ్మెల్యేలపై ఎన్నికల నుంచి జీవితకాల నిషేధం విధించాలని కోరుతూ అశ్విని ఉపాధ్యాయ్ దాఖలు చేసిన పిల్‌పై కోర్టు.. ఈ విధంగా వ్యాఖ్యలు చేసింది.