AP

100 రోజుల ప్రణాళిక.. ఉమ్మడి మేనిఫెస్టో.. అజెండా ఇదేనా..?

తెలుగుదేశం, జనసేన ఉమ్మడి ఏజెండాతో ముందుకెళ్లేందుకు సిద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ రెండు పార్టీల నేతలు విజయవాడలో ఓ ప్రైవేట్ హోటల్‌లో సమావేశమయ్యారు. ఈ భేటీకి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ హాజరయ్యారు. ప్రధానంగా ఉమ్మడి మేనిఫెస్టో, కామన్ మినిమమ్ ప్రొగ్రాం రూపకల్పనపై చర్చలు జరిగినట్లు సమాచారం.

 

పూర్తిస్థాయి మేనిఫెస్టో రూపకల్పనే ప్రధాన అజెండాగా సమావేశం జరిగిందని తెలుస్తోంది. మేనిఫెస్టో ప్రకటనలోపు ఉమ్మడి కార్యాచరణ దిశగా వెళ్లేందుకు కరపత్రం రెడీ చేసినట్లు సమాచారం. కరపత్రం రూపకల్పనపైనా సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగిందని సమాచారం. 100 రోజుల ప్రణాళికను టీడీపీ-జనసేన సిద్ధం చేసుకోనుంది. ప్రజా సమస్యలు, ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఐక్య పోరాటం చేసే దిశగా అడుగులు వేస్తున్నాయి.

 

ఓటరు జాబితా అవకతవకలపైనా ఉమ్మడి పోరుకు ప్రణాళిక సిద్ధం చేయడంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాల స్థాయిలో ఇప్పటికే ఇరు పార్టీలు సమావేశాలు పూర్తి చేసుకున్నాయి. నియోజకవర్గాల స్థాయిలో సమావేశాలపై టీడీపీ-జనసేన నేతలు త్వరలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈ సమావేశానికి టీడీపీ నుంచి లోకేష్, అచ్చెన్నాయుడు, యనమల రామకృష్టుడు, పితాని సత్యనారాయణ, నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్, తంగిరాల సౌమ్య హాజరయ్యారు. జనసేన నుంచి నాదెండ్ల మనోహర్, కందుల దుర్గేష్, పాలవలస యశస్వి, బొమ్మిడి నాయికర్, మహేందర్‌రెడ్డి, కొటికలపూడి గోవిందరావు పాల్గొన్నారు. అక్టోబర్‌ 23న రాజమండ్రిలో ఇరు పార్టీల తొలి సమావేశం జరిగింది.