TELANGANA

నాంపల్లి అగ్నిప్రమాదంపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలి : గవర్నర్

నాంపల్లిలో సోమవారం జరిగిన ఘోర అగ్ని ప్రమాదంపై రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలో ఉన్నవారికి మెరుగైన చికిత్స అందించాలని సీఎస్‌కు సూచించారు. ఘటనకు కారణాలు, తీసుకున్న చర్యలపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.

 

ప్రభుత్వ వైఫల్యం వల్లే నాంపల్లి అగ్నిప్రమాదం : రేవంత్ రెడ్డి

అగ్నిప్రమాద ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి అన్నారు. అగ్ని ప్రమాదాలకు హైదరాబాద్ నిలయంగా మారిపోయిందన్నారు. నగరంలో రుస అగ్ని ప్రమాదాలు జరుగుతున్నా ప్రభుత్వం ఎటువంటి నివారణ చర్యలు చేపట్టడం లేదని ఆయన విమర్శించారు.

 

అగ్ని ప్రమాదంలో 9 మంది చనిపోవడం అత్యంత బాధాకరమైన విషయమని రేవంత్ అన్నారు. అక్కడ ఒక రెసిడెన్షియల్ ఏరియాలో కెమికల్ డ్రమ్ములు ఎలా పెట్టారని ప్రశ్నించారు.

ఈ విషయంలో సమగ్ర విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. మృతుల కుటుంబాలను ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలని రేవంత్ కోరారు.

 

ప్రభుత్వం ఏం చేస్తోంది? నిర్లక్ష్యం వల్లే అగ్నిప్రమాదం : కిషన్ రెడ్డి

ప్రజలు నివసించే ప్రదేశాల్లో ప్రమాదకర గోడౌన్లు ఎలా వెలిశాయని? అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు . నాంపల్లిలోని బజార్ ఘాట్ అగ్ని ప్రమాద స్థలానికి వెళ్లి ఆయన పరిస్థితిని సమీక్షించారు.

 

ఇది చాలా దురదృష్టకరం.. కెమికల్ గోడౌన్ కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని అన్నారు. జనాభా ఎక్కువగా ఉన్న ప్రాంతంలో ఇలాంటి గోడౌన్ ఉండడంతో అందులో దీపావళి బాణసంచా నిప్పురవ్వలు పడి.. అగ్నిప్రమాదం సంభవించడం దురదృష్టకరం అన్నారు. ఈ గోడౌన్ లేకపోయి ఉంటే, ఇలా జరిగేది కాదని అభిప్రాయపడ్డారు. ఇలాంటి అక్రమ గోడౌన్లపై రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు.