TELANGANA

అఫిడవిట్‌తో ఎన్నికల కమీషన్‌కే షాకిచ్చిన మంత్రి మల్లారెడ్డి..!

మల్లారెడ్డి అంటే మామూలు మనిషి కాదు. విద్యాసంస్థల అధినేత. మామూలు ఇన్‌స్టిట్యూట్స్ కావు. ఎంబీబీఎస్, ఎంబీయే, ఎంటెక్ వంటి కాస్ట్‌లీ కోర్సులు కూడా నేర్పిస్తారక్కడ. పైగా మంత్రి. కార్మిక శాఖను ఉద్దరించే బాధ్యత చూసిన మల్లారెడ్డి. అలాంటి మంత్రి తాను ఎక్కడ చదివానో మర్చిపోయినట్టున్నారు. అందుకే ఆయన అఫిడవిట్ చూసి ఎన్నికల సంఘానికే దిమ్మ తిరిగింది. కళ్లు బైర్లు కమ్మిన పరిస్థితి.

 

ఎందుకంటారా.. ఒక వ్యక్తి ఒకేసారి మూడు చోట్ల ఇంటర్ చదవడం సాధ్యమా? 9 ఏళ్ల వ్యవధిలో తన వయసును 15 ఏళ్లు పెంచుకోవడం వీలవుతుందా? ఇవన్నీ మంత్రి మల్లారెడ్డి సాధ్యమయ్యాయి? ఎలాగంటారా! ఆయన సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో.

 

2014లో.. మేడ్చల్ ఎంపీగా గెలిచారు మల్లారెడ్డి. ఆ సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో.. తన వయసు 56 ఏళ్లుగా చెప్పారు. ఇప్పుడు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో వయసు ఎంత చెప్పారో తెలుసా 70. అంటే.. 9ఏళ్లలో ఆయన వయసు 14 సంవత్సరాలు పెరిగిపోయింది. అదేమైనా ఆస్తా? పెట్టుబడి పెడితే పెరగడానికి. వయసు ఏడాదికి ఒక సంవత్సరమే పెరుగుతుంది కదా. ఇంత చిన్న లాజిక్ మంత్రి మల్లారెడ్డి ఎలా మర్చిపోయాడో! ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏమిటంటే.. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన చెప్పుకున్న వయసు 65 ఏళ్లు. అంటే 2014 నుంచి నాలుగేళ్లలో ఆయన వయసును తొమ్మిదేళ్లు పెంచేసుకున్నారు. ఎందుకలా చేశారో.. ది గ్రాండ్ మల్లారెడ్డి గారే చెప్పాలి.

 

 

ఇక, విద్యార్హతల విషయానికి వద్దాం. 2014 అఫిడవిట్ ప్రకారం ఆయన ఇంటర్మీడియట్‌ను ఎక్కడ చదివారో తెలుసా.. ప్యాట్నీ సెంటర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజ్‌లో. 2018 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం ఆయన ఇంటర్ చదివింది సికింద్రాబాద్ వెస్లీ కాలేజ్‌లో. ప్రస్తుత ఎన్నికల అఫిడవిట్‌లో ఆయన చెప్పింది ఏ కాలేజ్ అంటే.. రాఘవలక్ష్మి జూనియర్ కాలేజ్. స్టూడెంట్ మల్లారెడ్డి ఒకేసారి మూడు కాలేజీల్లో ఎలా చదగలిగారు? అప్పటినుంచే తాను మాయాజాలం చూపించడం మొదలుపెట్టారా? సరే, ఒక్కోసారి ఒక్కో కాలేజ్‌లో ఇంటర్ చదివారు అనుకుందాం. అఫిడవిట్ చూస్తే అలా అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే.. తాను ఇంటర్ పూర్తి చేసింది 73లో అంటూ మూడు అఫిడవిట్లలోనూ ఒకే సంవత్సరం రాశారు మల్లారెడ్డి. ఇయర్‌ మాత్రం కరెక్ట్‌గా గుర్తుపెట్టుకున్నారాయన.

 

మల్లారెడ్డి ఎలా చెప్పుకుంటే మీకేంటి అనడానికి లేదు. ఆయన విద్యాసంస్థల్లో స్టూడెంట్స్ ఇలా తప్పుల తడకలు రాస్తే మార్కులేస్తారా? పాస్ చేస్తారా? ఇదే విషయాన్ని ఆయన ప్రత్యర్థులు ప్రశ్నిస్తున్నారు. ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా అఫిడవిట్‌లో వివరాలు రాశారని.. మల్లారెడ్డి ఎన్నికల్లో పోటీ చేయడానికే అనర్హుడు అంటూ రిటర్నింగ్ ఆఫీసర్ దృష్టికి తీసుకెళ్లారు.