మరో ఐదు రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలకు సిద్దమవుతున్న తెలంగాణలో ప్రధాని మోడీ ఇవాళ పర్యటిస్తున్నారు. కామారెడ్డిలో బీజేపీ ఏర్పాటు చేసిన ఎన్నికల సభలో పాల్గొన్న ప్రధాని.. బీఆర్ఎస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు బీఆర్ఎస్ సర్కార్ తో విసిగిపోయారని, వారు మార్పు కోరుకుంటున్నారని మోడీ తెలిపారు. అలాగే ఏడు దశాబ్దాలుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా జనాల్ని పట్టించుకోలేదని మోడీ ఆరోపించారు.
కామారెడ్డిలో ఏర్పాటు చేసిన బీజేపీ విజయసంకల్ప సభలో ప్రధాని మోడీ బీఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శల వర్షం కురిపించారు. రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందని, సకల జనుల సౌభాగ్య తెలంగాణ కోసం ప్రతీ ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తెలంగాణకు పసుపు బోర్డు సహా పలు హామీలు ఇచ్చామని, వాటిని నిలబెట్టుకున్నామని ప్రధాని మోడీ తెలిపారు. జాతీయ రాజకీయాల్లో హామీలు అమలు చేయడంలో బీజేపీకి తిరుగులేని రికార్డు ఉందని ప్రధాని మోడీ తెలిపారు.కేంద్రంలో ఆర్టికల్ 370 రద్దు, మహిళా బిల్లు, ట్రిపుల్ తలాక్ రద్దు, రైతులకు గిట్టుబాటు ధరలు, అయోధ్య రామాలయ నిర్మాణం సహా కేంద్రం నెరవేర్చిన పలు హామీల్ని ఈ సందర్భంగా ప్రధాని మోడీ తెలంగాణ ఓటర్లకు గుర్తుచేసారు.
తెలంగాణలో అధికారమిస్తే బీసీని సీఎం చేస్తామని హామీ ఇచ్చామని ప్రధాని మోడీ తెలిపారు. ఇప్పటికే బీసీ వర్గాల నుంచి ప్రధాని, కేంద్రమంత్రుల సహా పలు పదవుల్ని బీజేపీ ఇచ్చిన విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు. మరోవైపు రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం గతంలో దళితులకు ఇచ్చిన సీఎం హామీని నిలబెట్టుకోలేదని మోడీ తెలిపారు. అలాగే బీసీలు, దళితులకూ బీఆర్ఎస్ సర్కార్ చేసిందేమీ లేదన్నారు. కానీ ఆయా వర్గాలకు తమ మ్యానిఫెస్టోలో చోటు కల్పించినట్లు ప్రధాని మోడీ చెప్పుకొచ్చారు. తద్వారా సామాజిక న్యాయం కోసం బీజేపీ కృషి చేస్తోందన్నారు