TELANGANA

కొలువులు కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించండి: ప్రియాంకా గాంధీ!!

తెలంగాణా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. ఇక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్న కాంగ్రెస్ అగ్రనేత ప్రియాంకా గాంధీ తెలంగాణా ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నారు. మధిర కాంగ్రెస్ అభ్యర్థి భట్టి విక్రమార్క, ఖమ్మం అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిల కోసం ప్రచారం సాగించిన ప్రియాంకా గాంధీ వారిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. సీఎం కేసీఆర్ పాలనను టార్గెట్ చేశారు.

 

నిరుద్యోగులకు 10 సంవత్సరాలుగా ఉద్యోగాలు ఇవ్వని సీఎం కేసీఆర్ తన కుటుంబంలో మాత్రం ఉద్యోగాలు ఇచ్చుకున్నాడని ఆయన కుటుంబాన్ని టార్గెట్ చేశారు. ఉద్యోగాలు కావాలనుకునే నిరుద్యోగులు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ ను గద్దె దింపాలని ప్రియాంకా గాంధీ పిలుపునిచ్చారు. కొలువులు ఇచ్చే కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని ప్రియాంకా గాంధీ విజ్ఞప్తి చేశారు.

 

తెలంగాణ ఇచ్చింది కేసీఆర్, కేసీఆర్ కుటుంబం బాగు కోసం కాదని పేర్కొన్న ప్రియాంకా గాంధీ రైతులు, ఆడబిడ్డలు, యువత, విద్యార్థులు అందరూ తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నారన్నారు. మాయ మాటలతో అధికారంలోకి వచ్చిన బిఆర్ఎస్ ప్రభుత్వం మీ కలలను నిజం చేయలేదని పేర్కొన్నారు . పది సంవత్సరాలుగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించిన బిఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణను భ్రష్టు పట్టించిందని స్పష్టం చేశారు.

 

కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న కొలువులను భర్తీ చేశాయని పేర్కొన్నారు . ప్రజల సంపదను ప్రజలకు పంచాయి అని పేర్కొన్న ప్రియాంకా గాంధీ ఉద్యోగాలు కావాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలన్నారు. యువతకు కొలువులు, అందరికీ ఇండ్లు, మహిళలకు ఆర్థిక స్వాలంబన అందించే పథకాలు, రైతులకు రుణమాఫీ చేసే ప్రభుత్వాన్ని తెలంగాణలో ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు.

 

తెలంగాణలో భారీ మెజార్టీతో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుంటే ప్రజల సంపద ప్రజలకు అందుతుందన్నారు. తెలంగాణాలో మార్పు రావాలి. కాంగ్రెస్ కావాలి అని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు హామీలను తప్పక నెరవేరుస్తామని స్పష్టం చేశారు.