AP

మూడు నెలల్లో ఏపీ ఎన్నికలు? తెలంగాణ ఎన్నికల తరువాత జగన్ వ్యూహం ఏమిటి..?

తెలంగాణలో కొత్త సభ కొలువుదీరింది. ఇక, ఏపీ సంగతేంటి? అక్కడి రాజకీయం రగులుతోంది. ఎప్పుడు ఎన్నికలొస్తాయో చంద్రబాబు చెప్పేశారు. ఎవరికి టికెట్లు ఇస్తానో కూడా క్లారిటీ ఇచ్చారు. మరి సీఎం జగన్ సంగతేంటి? సిట్టింగ్‌లకు మళ్లీ ఛాన్సిస్తారా? మారుస్తారా?

 

మరో మూడు నెలల్లో ఆంధ్ర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు వస్తాయని చంద్రబాబు చెబుతున్నారు. అందుకు తగ్గట్టు వ్యూహరచన చేస్తున్నారు. జనసేనతో పొత్తుపై చాలా క్లారిటీతో ఉన్నారు చంద్రబాబు. సీట్ల పంపకాల మీద కూడా మాటలు నడిచాయి. ఎవరు ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలి, ఎక్కడ-ఎవరు బరిలోకి దిగాలో కూడా అవగాహనకు వస్తున్నారు. గెలిచే వారికే టికెట్లంటూ ప్రకాశం జిల్లా పర్యటనలో పసుపు దండుకు కుండబద్దలు కొట్టి చెప్పేశారు చంద్రబాబు నాయుడు.

 

టీడీపీ – జనసేన పొత్తు విషయంలో ప్రత్యర్థి వైసీపీ కార్నర్ చేస్తున్న అంశం ముఖ్యమంత్రి ఎవరు అని. ఈ విషయంలో పవన్ చొరవ తీసుకున్నారు. తాను, చంద్రబాబు కలిసి సీఎం అభ్యర్థిని నిర్ణయిస్తామంటూ జన సైనికులకు స్పష్టంచేశారాయన.

 

మరి, అధికార పార్టీ దారెటు? తెలంగాణ ఎన్నికల ఫలితాల నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటి? తెలంగాణ ఎన్నికల ఫలితాలు కళ్లముందే ఉన్నాయి. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు ఘోరంగా ఓడిపోయారు. అరడజను మంది మంత్రులు కూడా మట్టికరిచారు. కేసీఆర్ నాయకత్వంలో బలంగా, తిరుగులేని శక్తిగా ఉందనుకున్న బీఆర్ఎస్ చాలాచోట్ల అడ్రస్ గల్లంతైంది. ఆ ఫలితాల నుంచి జగన్ పాఠాలు నేర్చారా.. ఇదే అసలు ప్రశ్న. సిట్టింగ్‌ ఎమ్మెల్యేలందరికీ టికెట్లు ఇస్తారా? ప్రోగ్రెస్ రిపోర్ట్ ఆధారంగానే ఛాన్స్ ఇస్తారా? ఇదిప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న.

 

మరోవైపు.. తెలంగాణ ఎన్నికల ఫలితాల్ని చూస్తే.. సంక్షేమం కంటే ప్రజలకు అందుబాటులో ఉండడం అనే కాన్సెప్ట్ బాగా వర్కౌట్ అయింది. కేసీఆర్ సహా కేటీఆర్ మొదలుకుని మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరూ తమకు అందుబాటులో లేరని, అహంకారం పెరిగిపోయిందని ప్రజలు భావించారు. కర్రుకాల్చి వాత పెట్టారు. సరిగ్గా ఇదే విషయంలో ఏపీలోని ప్రతిపక్షం ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తోంది. విర్రవీగితే ఫలితం ఎలా ఉందో చూశారుగా అంటూ చంద్రబాబు నాయుడు డైరెక్ట్ ఎటాక్ మొదలుపెట్టారు. దీనిపై మంత్రులు ఎదురుదాడి చేస్తున్నారు.

 

మరోవైపు.. తెలంగాణలో లేదనుకున్న కాంగ్రెస్ గెలవడానికి కారణం ఏంటి? తెలంగాణ ఒకప్పుడు ఎట్లుండె.. ఇప్పుడు ఎట్లుంది.. అంటూ కేసీఆర్ చేసిన ప్రచారం ఎందుకు ఎదురుతన్నింది? వీటిపై ఏపీ రాజకీయాల్లో చర్చ జరుగుతోంది. అదే సమయంలో కేసీఆర్ ఎక్కడైతే సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారో.. అక్కడ కారు స్పీడుగానే సాగింది. సట్టింగ్‌ల పనితీరు, ప్రజలకు అందుబాటులో లేకపోవడం కాంగ్రెస్‌కు కలిసొచ్చింది. ఇదే పాయింట్‌పై ఏపీ విషయానికి వస్తే.. ఒకప్పుడు తన పాదయాత్రలో ప్రజల్లోకి చొచ్చుకెళ్లిన జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలకు దూరమయ్యారనే విమర్శలు ఉన్నాయి. అదే టైంలో చంద్రబాబు, లోకేష్, పవన్.. వివిధ కార్యక్రమాలతో ప్రజల మధ్య తిరుగుతున్నారు. ఈ విషయంలో సీఎం జగన్ రియలైజేషన్ అవుతారా? మరి, సిట్టింగ్ ఎమ్మెల్యేల విషయంలో ఒకసారి రిపోర్టుల ఆధారంగా అని, మరోసారి అందరికీ టికెట్ ఇస్తానంటూ చెప్పారాయన.

 

ఫైనల్‌గా ఏం చేస్తారనేది ఆసక్తిగా మారింది. కాకపోతే, కేసీఆర్‌కు, జగన్‌కు మధ్య తేడా చూస్తే.. తెలంగాణలో ప్రశాంత్ కిషోర్ టీమ్‌కు కేసీఆర్ కటీఫ్ చెప్పారు. జగన్ కంటిన్యూ అవుతున్నారు. ఐప్యాక్ టీం సభ్యులు రాష్ట్రమంతా ప్రభుత్వ కార్యక్రమాల అమలుతీరును పర్యవేక్షిస్తున్నారు. వాళ్లిచ్చే రిపోర్ట్ జగన్‌కు కచ్చితంగా ప్లస్ కానుంది. మరి, వాళ్లమీదనే ఆధారపడతారా? సొంత నివేదికలు తెప్పించుకుంటారా? అటు విపక్షంలో ఫుల్ జోష్ కనిపిస్తోంది. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతోనే తాము గెలిచిపోయినట్టు భావిస్తున్నారు. ఎవరు ఎలా ప్రజల మనసు గెలుస్తారనేది మరికొద్ది రోజుల్లో వ్యూహాలు సిద్ధం అవుతాయి.