AP

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్: వైఎస్ జగన్.

రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థను బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా వైఎస్ జగన్- 16 సబ్ స్టేషన్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. మరో 12 ఉప కేంద్రాలను ప్రారంభించారు. తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వర్చువల్‌గా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారాయన.

 

ఆయా సబ్ స్టేషన్ల వ్యయం 3,100 కోట్ల రూపాయలు. కర్నూలు, నంద్యాల, కడప, సత్యసాయి పుట్టపర్తి, ప్రకాశం, గుంటూరు, ఏలూరు, పశ్చిమ గోదావరి, డాక్టర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, కాకినాడ, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పల్నాడు, నెల్లూరు, అన్నమయ్య రాయచోటి జిల్లాల్లో వాటిని అందుబాటులోకి తీసుకొచ్చింది ప్రభుత్వం.

 

ఆయా జిల్లాల్లో 28 ప్రాంతాల్లో 132/33 కేవీ, 220/132 కేవీ, 400/220 కేవీ, 400/132 కేవీ సామర్థ్యాలతో ఈ సబ్‌స్టేషన్లు ఏర్పాటవుతున్నాయి. ఈ సందర్భంగా జగన్ మాట్లాడారు. రైతులకు పగటి పూటే 9 గంటల విద్యుత్‌ ఇవ్వాలని నిర్ణయించామని, దాన్ని నెరవేరుస్తోన్నామని అన్నారు.

 

అన్ని రంగాలకూ నాణ్యమైన విద్యుత్‌ అందివ్వాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమని, ఆ దిశ‌గా అడుగులు వేస్తోన్నామని వివరించారు. కొత్తగా ప్రారంభించిన సబ్‌స్టేషన్లను స్థానికులకే అంకితం చేస్తున్నామని పేర్కొన్నారు. 14 జిల్లాల్లో ట్రాన్స్‌మిషన్‌ కెపాసిటి పెంచుతూ సబ్‌ స్టేషన్ల ప్రారంభం, శంకుస్థాపనలు చేస్తున్నామని అన్నారు.

 

నాణ్యమైన విద్యుత్‌ను ప్రతి గ్రామానికి, ప్రతి రైతుకు ఇచ్చే వ్యవస్థను రూపొందించుకున్నామని, 1,700 కోట్ల రూపాయలతో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేశామని అన్నారు. పగటి పూటే 9 గంటల నాణ్యమైన కరెంటును సరఫరా చేయగలుగుతున్నామని జగన్ వివరించారు. రూ.2.49 పైసలకే ఒక యూనిట్ సౌర విద్యుత్‌ను అందజేసే ప్రయత్నం చేస్తోన్నామని చెప్పారు.

 

2024 సెప్టెంబర్ నాటికి 3,000 మెగా వాట్ల విద్యుత్ అందుబాటులోకి వస్తుందని వైఎస్ జగన్ గుర్తు చేశారు. దీనికోసం- 3,400 కోట్ల రూపాయలతో సుమారు 8,000 మెగావాట్ల సౌర విద్యుత్ ఉత్పత్తికి శంకుస్థాపనలు చేయనున్నామని చెప్పారు. సోలార్‌ పార్కులో రెండు పరిశ్రమలు వస్తున్నాయని, వాటి ద్వారా 1,700 ఉద్యోగాలు వస్తాయని అన్నారు.